: ట్రంప్ గెలుపు వల్ల నష్టపోయేది భారతా? లేక పాక్, చైనాలా?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కావడం ప్రపంచ దేశాల్లో ఆసక్తిరేపుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ ఆమెరికా నుంచి ప్రయోజనాలు పొందుతున్న ఏ దేశాన్నీ విమర్శించకుండా వదలలేదు. విమర్శలు, హెచ్చరికలు, బెదిరింపులు, వ్యంగ్యం ఇలా అన్ని విధాలుగా ఆయా దేశాలను ఎండగట్టారు. ఓ సభలో భారతీయ కాల్ సెంటర్‌ ఉద్యోగుల ఇంగ్లిష్ యాసను అనుకరించి ఎగతాళి కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విదేశాంగ విధానం ఎలా ఉండే అవకాశం ఉందన్న దానిపై అమెరికా దౌత్యవేత్త విలియం హెచ్. ఏవరీ మాట్లాడుతూ, ప్రచార సభల్లో కాల్ సెంటర్ ఉద్యోగుల యాసను ఎగతాళి చేసినంతమాత్రాన ఆయన భారత్ కు వ్యతిరేకి కాదని అన్నారు. అదే సమయంలో ఆయన నుంచి చైనా, పాకిస్థాన్ దేశాలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాతో భారత్ పొందే ప్రయోజనాల కంటే చైనా, పాకిస్థాన్ దేశాలు దశాబ్దాలుగా అమెరికా నుంచి ప్రయోజనాలు పొందాయని ఆయన గుర్తు చేశారు. చైనా అమెరికాలో భారీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. గత 15 ఏళ్లలో అమెరికా 50 లక్షల మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలను కోల్పోగా, చైనాలో మాన్యుఫ్యాక్చరింగ్ రంగం విపరీతంగా వృద్ధి చెందింది. లక్షల ఉద్యోగాలు కల్పించుకునే స్థాయికి ఎదిగింది. దీంతో ట్రంప్ దీనిని పరిశీలించే అవకాశం ఉంది. అదే సమయంలో షాంఘై నుంచి అమెరికా వెళ్ళే మెషినరీపై టారిఫ్‌ ను విధించడం కన్నా హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కోడ్‌ పై టారిఫ్ విధించడం బహు కష్టతరమైన అంశం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో ట్రంప్ కారణంగా భారత్ లోని ఔట్ సోర్సింగ్ రంగానికి కొంత నష్టం జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ, చైనాకు జరిగే నష్టంతో పోలిస్తే పెద్ద నష్టం అనిపించుకోదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోరాటం పేరుతో పాకిస్థాన్ 2002 నుంచి అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం పొందుతోంది. ట్రంప్ మాటలను బట్టి చూస్తే పాక్ కు వెళ్తున్న నగదు ప్రవాహంలో కోత విధించే అవకాశం కనిపిస్తోంది. అదీ కాక ట్రంప్ వ్యక్తిగతంగా ముస్లిం వ్యతిరేకి కనుక పాకిస్థాన్‌ కు భారీ నష్టం తప్పదని ఆయన పేర్కొన్నారు. గతంలో ట్రంప్ మాట్లాడుతూ, పాకిస్థాన్ చాలా ప్రమాదకరమైన దేశమని అన్నారని తెలిపారు. భారతదేశాన్ని కలుపుకొనిపోవాలని, పాకిస్థాన్‌ను నిరోధించగలిగే దేశం భారతదేశమేనని ట్రంప్ అన్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా చూస్తే ట్రంప్ వల్ల ఆసియాలో భారత్ కు ప్రయోజనమే ఉంటుందని చెప్పచ్చు!

More Telugu News