: నల్లధనం ఉన్నవారే నిద్రలేని రాత్రి గడిపారు: వెంకయ్యనాయుుడు

ఎవరి వద్ద అయితే నల్లధనం ఉందో వారే నిద్రలేని రాత్రి గడిపారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోందని, నగదు రహిత లావాదేవీలకు ఇది ముందడుగు అని అన్నారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొద్ది మంది మాత్రమే కావాలని రాజకీయం చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచే నల్లధన నివారణకు చర్యలు తీసుకున్నామని, ప్రజలతో బ్యాంకు ఖాతాలు తెరిపించి నేరుగా జమయ్యేలా చేశామన్నారు. ‘సబ్ కా సాత్-సబ్ కా వికాస్’ అనేదే తమ ప్రధాన ఉద్దేశమని, తొలిరోజు నుంచి తీసుకున్న చర్యల్లో భాగమే ఈ నోట్ల రద్దు అని అన్నారు. డబ్బు స్వతంత్రంగా వెల్లడించాలన్న పిలుపునకు మంచి స్పందన వచ్చిందని, బినామీ లావాదేవీల బిల్లు తీసుకువచ్చామని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు చేరువ కావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల కొన్ని పార్టీలు దిగ్భ్రాంతికి గురయ్యాయని, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ పలు రకాలుగా ఎందుకు మాట్లాడుతోందో అర్థం కావడం లేదన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

More Telugu News