: రూ.2000 నోట్ల‌లో చిప్ పెడ‌తార‌న్న మాట ఎలా వ‌చ్చిందో నాకు అర్థం కావ‌ట్లేదు: జైట్లీ

పెద్ద నోట్లు ర‌ద్దు చేసి, కొత్త నోట్లను చ‌లామ‌ణిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల సామాన్యుల్లో ఆందోళ‌న అవసరం లేదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలో ఆర్థిక శాఖ అధికారుల‌తో క‌లిసి ఈ రోజు ఆయ‌న‌ మీడియా సమావేశం ఏర్ప‌ర‌చి విలేక‌రులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. ఈ సంద‌ర్భంగా కొత్త నోట్లు విడుద‌లకాక‌ముందే వాటిపై వ‌స్తోన్న ప‌లు వార్త‌ల ప‌ట్ల మాట్లాడుతూ.. రూ.2000 నోట్ల‌లో చిప్ పెడ‌తార‌న్న మాట ఎలా వ‌చ్చిందో త‌న‌కు అర్థం కావ‌ట్లేదని వ్యాఖ్యానించారు. త‌న‌కు తెలిసినంత‌వ‌ర‌కు అలాంటిదేమీ లేద‌ని అన్నారు. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి దేశంలో జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లు అమ‌లులోకి వ‌స్తుంద‌ని, ఆ త‌రువాత ఎక్క‌డ ఏ న‌గ‌దు లావాదేవీలు జ‌రిపినా బ‌య‌ట‌ప‌డ‌తారని జైట్లీ స్ప‌ష్టం చేశారు. నగ‌దు బ‌దిలీ ప్ర‌క్రియ‌, ప్ర‌జ‌లు ఖ‌ర్చు చేసే న‌గ‌దు ప‌ద్ధ‌తుల్లో మార్పు వ‌స్తుందని ఆయ‌న చెప్పారు. న్యాయ‌బ‌ద్ధంగా సంపాదించుకున్నప్పుడు బ్యాంకుల్లో జ‌మ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దని స్పష్టం చేశారు. రేపు రూ.10 ల‌క్ష‌లు జ‌మ‌చేసి రెండ్రోజుల త‌రువాత ఎవరికైనా చెక్కు రాసి కూడా ఇవ్వ‌వ‌చ్చని వ్యాఖ్యానించారు.

More Telugu News