: ఉత్కంఠతో అమెరికా ఎన్నికల ఫలితాలను వీక్షిస్తోన్న యూపీ గ్రామవాసులు.. కారణం వుంది మరి!

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ గ్రామంలో ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎన్నిక‌ల‌ ఫ‌లితాలు చూడ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. మోహన్‌ లాల్‌ గన్‌ జిల్లాలోని జాబ్రౌలీ గ్రామస్తులు హిల్లరీ క్లింట‌న్‌కే త‌మ మ‌ద్ద‌తు అంటూ, ఆమె గెలవాలని కోరుకుంటున్నారు. క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ వస్తున్న‌ప్పుడు టీవీలు ఏర్పాటు చేసుకొని అంద‌రూ ఒకేచోట కూర్చొని చూసే సీన్లు ఆ గ్రామంలో ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాల నేపథ్యంలో క‌న‌ప‌డుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ కౌంటింగ్ విశేషాల‌ వార్తలను టీవీల్లో ఎంతో ఉత్కంఠతో చూస్తున్నారు. అయితే, వీరు హిల్ల‌రీనే గెల‌వాల‌ని కోరుకోవ‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంది. జాబ్రౌలీ గ్రామాన్ని క్లింటన్‌ హెల్త్ ఫౌండేషన్‌ దత్తత తీసుకుని అక్క‌డ వివిధ‌ సేవా కార్యక్రమాలను కొన‌సాగిస్తోంది. గ‌తంలో హిల్లరీ క్లింటన్‌ భర్త బిల్‌ క్లింటన్ త‌మ‌ గ్రామాన్ని సందర్శించారని చెబుతున్నారు. అందుకే వారంతా హిల్ల‌రీ గెల‌వాల‌ని కోరుకుంటున్నారు. హిల్లరీ క్లింటన్‌ గెలుస్తుందని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె ట్రంప్ చేతిలో ప‌రాజ‌యం పొందితే విచారం వ్య‌క్తం చేస్తామ‌ని చెప్పారు.

More Telugu News