: ముస్లింలను రానివ్వం, భారత్, చైనా ఉద్యోగులను తరుముతాం: ట్రంప్ వర్గం అరుపులు

ఇకపై అమెరికాలోకి ముస్లింలను రానివ్వబోమని, తమ ఉద్యోగాలను లాక్కుంటున్న చైనా, భారత ఉద్యోగులను తరిమేస్తామని ట్రంప్ వర్గం నినాదాలు చేస్తున్న పరిస్థితి అమెరికాలోని విదేశీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికాలో తక్కువ చదువుకున్న నిరుద్యోగులు, పల్లె ప్రాంత ప్రజల మద్దతుతోనే ట్రంప్ అధికార పీఠానికి చేరువయ్యారు. సంప్రదాయ అమెరికన్ వాదాన్ని బలపరిచే వారంతా ట్రంప్ కు వెన్నుదన్నుగా నిలిచి ఓటేసి ఆశీర్వదించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఉగ్రవాద భయాలు పెరిగిన వేళ, ముస్లింలే టెర్రరిజానికి కారణమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో గట్టిగా నాటుకు పోయాయని, మెక్సికో నుంచి వస్తున్న ముప్పును అరికట్టేలా గోడ కడతానని ఆయన చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియా, చైనా తదితర దేశాల నుంచి వివిధ రకాల వీసాలపై వస్తున్న వారిని అడ్డుకుని స్వదేశీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రంప్ చేసిన హామీలు నిరుద్యోగులను ఆకర్షించాయని, వీటన్నింటి ముందూ ఆయనపై వచ్చిన లైంగికారోపణలు తేలిపోయాయని పలువురు వ్యాఖ్యానించారు. అమెరికా వంటి దేశంలో లిబరల్ సెక్సీ లైఫ్ స్టయిల్ చాలా కామన్ కాబట్టి, ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు ఎంతమాత్రమూ ప్రభావం చూపలేదని ఆయన వర్గంలో ఉంటూ ప్రచార బాధ్యతలను పంచుకున్న ఓ యువతి వ్యాఖ్యానించింది. ఇక ట్రంప్ విజయం ఖాయమని తెలిసిన తరువాత ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. బులియన్ మార్కెట్ పుంజుకుంది. క్రూడాయిల్ పతనమైంది. ఈ ఉదయం 10:40 గంటల సమయంలో సెన్సెక్స్ 1043 పాయింట్ల నష్టంతో 26,548 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 361 పాయింట్ల నష్టంతో 8,182 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. భారత బాస్కెట్ క్రూడాయిల్ ధర బ్యారల్ కు 3.36 శాతం పడిపోయి రూ. 2,908 వద్ద (నవంబర్ డెలివరీ) కొనసాగుతోంది.

More Telugu News