: అమెరికా ఎన్నికల తొలి ఫలితం... డిగ్జ్ విల్లే నాచ్ లో హిల్లరీ క్లింటన్ గెలుపు

దాదాపు సంవత్సరం కాలానికి పైగా ఉత్కంఠను రేపుతూ వచ్చిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది. న్యూ హ్యాంప్ షైర్ లోని డిగ్జ్ విల్లే నాచ్ లో ఎన్నికలు పూర్తికాగా, కౌంటింగ్ చేసి ఫలితాన్ని వెల్లడించారు. డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 4-2 ఓట్ల తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై విజయం సాధించారు. కెనడా సరిహద్దులకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది. 8వ తేదీ ప్రవేశించగానే అర్ధరాత్రి 12:01కి పోలింగ్ ప్రారంభం కాగా, ఊళ్లోని ఓటర్లంతా వెంటనే ఓట్లు వేయడం, అందరూ ఓటేయగానే వాటిని లెక్కించడం పూర్తయింది. అసలు అమెరికా ఎన్నికల్లో ఎప్పుడు ఓటింగ్ జరిగినా తొలి ఫలితం ఇక్కడి నుంచే రావడం ఆనవాయితీ. వాస్తవానికి ఇక్కడ మొత్తం 8 మంది రిజిస్టర్డ్ ఓటర్లు మాత్రమే ఉన్నారు. అందులో నలుగురు హిల్లరీకి ఓటు వేశారు. ఇద్దరు ట్రంప్ కు, మరో ఇద్దరు ఓటర్లు మిట్ రొమ్నీ, గ్యారీ జాన్సన్ లకు చెరో ఓటు వేశారు. దీంతో తన సమీప ప్రత్యర్థి ట్రంప్ కన్నా రెండు ఓట్ల మెజారిటీతో హిల్లరీ విజయం సాధించినట్లయింది. హ్యాంప్ షైర్ చట్టాల ప్రకారం, 100 కంటే తక్కువ రిజిస్టర్డ్ ఓటర్లున్న గ్రామాలు అర్ధరాత్రి నుంచి ఓటు వేయవచ్చన్న సంగతి తెలిసిందే. కాగా, పలు చోట్ల ఓటింగ్ జరుగుతుండగా, అత్యధిక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల తరువాత (భారత కాలమానం ప్రకారం) ఓటింగ్ మొదలు కానుంది.

More Telugu News