: ఓటరు మహాశయులారా... అంటూ ట్రంప్, హిల్లరీ చివరి విన్నపాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార ఘట్టం పరిసమాప్తమైంది. ఎవరు గెలుస్తారో ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితులు ఏర్పడిన వేళ, హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లు తమ ఆఖరి ప్రచార సభలను సైతం ప్రత్యర్థులను విమర్శించేందుకే వినియోగించుకున్నారు. హిల్లరీకి మద్దతుగా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పలు సభల్లో ప్రసంగించారు. హిల్లరీ క్లింటన్ అమెరికా సమ్మిళిత వృద్ధిని ప్రస్తావించగా, ట్రంప్, అవినీతిని రూముమాపుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ-మెయిల్స్ వ్యవహారంలో క్లింటన్ పై ఎలాంటి కేసూ లేదని ఆదివారం నాడు ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామే ప్రకటించిన తరువాత, రెట్టించిన ఉత్సాహంతో ఈ రెండు రోజులూ హిల్లరీ ప్రచారాన్ని నిర్వహించారు. ఓ వైపు నుంచి భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మరో వైపు నుంచి ఒబామా ఆమెకు మద్దతుగా దేశవ్యాప్త పర్యటనలు చేశారు. హిల్లరీ ఆఖరి ప్రచార సభకు బిల్, ఒబామా, మిచెల్ లు హాజరయ్యారు. ఇక డొనాల్డ్ ట్రంప్, సోమవారం నాడు ఐదు ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. తాను చాలా దూరం ప్రయాణించానని, ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి వుందని చెప్పారు. గెలిచేది తానేనని, ఆ విషయం మరి కొన్ని గంటల్లో తెలుస్తుందని స్క్రాన్టన్, పెన్సిల్వేనియాల్లో జరిగిన సభల్లో వ్యాఖ్యానించారు. తనకు ఓట్లేసి గెలిపించాలని కోరారు.

More Telugu News