: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఇక ‘డాయిష్’.. ఇక నుంచి ఇలానే పిలవాలని కేంద్రం నిర్ణయం!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్..’ ను ఇక నుంచి ‘డాయిష్’గా సంబోధించాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ కమ్యూనికేషన్లలో ఇక నుంచి ‘ఐఎస్’ అని కాకుండా ‘డాయిష్‌’గా పిలవాలని యోచిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థను ‘ఇస్లామిక్ స్టేట్’గా సంబోధించడం వల్ల జాతీయత లేని ఆ సంస్థకు చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డాయిష్ అనేది ‘అల్-దవియా అల్-ఇస్లామియా ఫె అల్-ఇరాక్ వ అల్-షామ్’(ది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా/షామ్) అనే దానికి సంక్షిప్త పదం. దీనిని ప్రపంచ దేశాలు ఐఎస్ఐఎస్ (ఐసిస్/ఐసిల్)గా వ్యవహరిస్తున్నాయి. అయితే దీనిని ఇస్లామిక్ స్టేట్‌గా పిలుస్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థకు సరిహద్దులు అనేవి లేవు. ఇది ఇస్లామిక్ గానీ, స్టేటు కానీ కాదని, ఓ ఉగ్రవాద సంస్థ మాత్రమేనని కౌంటర్ టెర్రర్ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ సంస్థను ఇక నుంచి ఇస్లామిక్ స్టేట్‌గా కాకుండా ‘డాయిష్‌’ గా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News