: కుంబ్లే కొత్త రూల్... క్రికెటర్లకు సవాలే!

టీమిండియాలో చీఫ్ కోచ్ కుంబ్లే కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా తరహాలో ఇకపై టీమిండియా క్రికెటర్లెవరైనా గాయపడితే... కోలుకున్నాక ముందుగా తమ ఫిట్ నెస్, ఫాంను దేశవాళీ టోర్నీల్లో నిరూపించుకోవాల్సిందేనని స్పష్టం చేశాడు. ఆ తర్వాతే జాతీయ జట్టుకి రావాలన్నాడు. దీంతో భవిష్యత్ లో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో పాటు, అత్యుత్తమ ఫిట్ నెస్ ను కూడా కలిగి ఉండాలని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ గాయాలతో సతమతమవుతున్నారు. వన్డేల్లో రోహిత్, ధావన్ కీలక ఆటగాళ్లన్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో రాహుల్ అవసరం చాలా ఉంది. అదే సమయంలో టీమిండియా రిజర్వ్ బెంచ్ కూడా బలంగా ఉంది. టీమిండియాలో సత్తా చాటేందుకు వర్థమాన ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. గాయాలపాలైనా ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పిస్తుండడంతో కొత్తవారికి అవకాశం దక్కడం లేదు. దీంతో సీనియర్లను ఉపేక్షించి లాభం లేదని, జట్టులో ఎవరి స్థానం స్థిరం కాదని చెప్పడంతో పాటు, ఫాం, ఫిట్ నెస్ చాలా ముఖ్యమని కుంబ్లే ఆటగాళ్లకు చెప్పకనే చెప్పాడు. కాగా, ఆపరేషన్ నిమిత్తం గాయపడ్డ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌ కు వెళ్తాడని బీసీసీఐ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. కుంబ్లే తాజా ప్రకటనతో రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ లు గాయాల నుంచి కోలుకున్న అనంతరం దేశవాళీ క్రికెట్‌ ఆడి ఫిట్‌ నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోకుండానే త్వరగా జట్టులోకి వచ్చేయాలనే తొందర ఆటగాళ్లకు ఉండకూడదనేది తన ఉద్దేశమని కుంబ్లే స్పష్టం చేశాడు.

More Telugu News