: దిల్ షుక్ నగర్ పేలుళ్ల కేసు ఏమవుతుందో చెప్పలేను... కానీ పెద్దపెద్ద కేసులన్నీ ఎందుకు వీగిపోతున్నాయి?: డిఫెన్స్ లాయర్ మహదేవ్

దిల్ షుక్ నగర్ పేలుళ్ల కేసులో వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉంటుందా? అంటూ దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల తరపున వాదనలు వినిపించిన డిఫెన్స్ న్యాయవాది మహదేవ్ మాట్లాడుతూ, పెద్ద పెద్ద కేసుల్లో వాదనలు న్యాయస్థానంలో ఎందుకు నిలవడం లేదని ప్రశ్నించారు. ఘటన ఎంత పెద్దదైనా, చిన్నదైనా అందులో సాక్ష్యాలు చాలా ముఖ్యమని అన్నారు. అలాంటి సాక్ష్యాల సేకరణలో పోలీసులు చేసే తప్పిదాలు, లేదా నిర్లక్ష్యం కేసులు నిలవకపోవడానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు. ఈ కేసులో కూడా బాంబు పేలుళ్ల నిందితులను స్పాట్ లో చూసిన వారు ఎవరూ లేరని ఆయన అన్నారు. అలాగే సంఘటనా స్థలంలో ఎలాంటి రసాయన ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. ఎన్ఐఏ యాక్ట్ లో సాక్షులు ముఖాలకు ముసుగులు ధరించి సాక్ష్యమివ్వవచ్చని అన్నారు. ఈ కేసులో ఎవరూ అలా ముసుగులు ధరించి న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యమివ్వలేదని చెప్పారు. ఈ కేసు నమోదైన నెల రోజుల తరువాత అంటే 14/3న ఎన్ఐఏకి ట్రాన్స్ ఫర్ అయిందని ఆయన తెలిపారు. అలాగే ఘటనలో నిందితులు కూడా తమను గాయపరిచిన వస్తువులు ఏంటనేది స్పష్టంగా చెప్పలేకపోయారని, ఏదో బలంగా తమను తాకింది, తాము పడిపోయామని చెప్పారని ఆయన అన్నారు. అలాగే ఈ కేసులో సాక్షులను బెదిరించిన ఘటనలేవీ చోటుచేసుకోలేదని ఆయన తెలిపారు. అయితే న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నది తాను చెప్పలేనని, తీర్పు కోసం ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. మానసికంగా చెప్పాలంటే, బాధితులు ఇంకా కోలుకోలేదన్న బాధ తనలో ఇంకా ఉందని, అయితే చట్టం అవేవీ చూడదని, కేవలం సాక్ష్యాలను మాత్రమే చూస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే కింది న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డ కేసుల్లో కూడా పై న్యాయస్థానాల్లో పెద్ద లాయర్లు వాదించేటప్పుడు అభియోగాలు తప్పుగా రుజువవుతుంటాయని, దీనికి కారణం పోలీసులు సరైన రీతిలో వివరాలు నమోదు చేయకపోవడమేనని ఆయన చెప్పారు.

More Telugu News