: సైకిళ్లపై బయలుదేరిన ‘సామూహిక’ పెళ్లికొడుకులు

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 258 మంది ‘సామూహిక’ పెళ్లికొడుకులు సైకిళ్లపై పెళ్లి మంటపానికి చేరుకున్నారు. గుర్రాలెక్కాల్సిన పెళ్లి కొడుకులు సెకిళ్లు ఎక్కి పెళ్లి మంటపానికి చేరుకున్నారేంటబ్బా అనే అనుమానం రాక మానదు. గుర్రం కళ్లెంను పట్టాల్సిన వారు సైకిల్ హ్యాండిల్ ను ఎందుకు పట్టుకున్నారంటే.. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ‘ఎకో ఫ్రెండ్లీ’గా ఉండాలంటూ చాటి చెప్పేందుకే ఈ పెళ్లి కొడుకులు ఆ పని చేశారు. ఇంతకీ, ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే, గుజరాత్ లోని సూరత్ లో. సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ సామూహిక వివాహాలను ఈరోజు నిర్వహించింది. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సౌరాష్ట్ర భవన్ నుంచి ప్రారంభించిన పెళ్లి కుమారుల సైకిల్ యాత్ర అక్కడి లోక్ సమర్పన్ రక్తదాన్ కేంద్రం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ అధ్యక్షుడు కంజి బలాల మాట్లాడుతూ, స్మార్ట్ నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ఈ విషయాన్ని చాటిచెప్పేందుకే కొత్త పెళ్లి కొడుకులతో ఈ యాత్ర చేపట్టామన్నారు.

More Telugu News