: అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ ఎవరో తేల్చేసిన స్కూల్ విద్యార్థులు!

అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడతారన్న విషయంపై ఎంతోమంది ఎన్నో రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. కొందరివి నిజమైతే మరికొందరి అంచనాలు తప్పుతున్నాయి. అయితే, న్యూయార్క్ లోని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎలిమెంటరీ స్కూల్ 1968 నుంచి వేస్తున్న అంచనాలు మాత్రం ఒక్కసారి కూడా లెక్కతప్పలేదు. దీంతో గత 48 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ స్కూలు మాక్ ఎలక్షన్స్ నిర్వహిస్తోంది. విద్యార్థులే ఇక్కడ ఓటర్లు. అలా పోలయిన ఓట్లలో ఎవరికి మెజారిటీ వస్తుందో, వారే దేశానికి అధ్యక్షుడు అవుతారని, అలాగే గతంలో అయ్యారని ఆ స్కూల్ యాజమాన్యం బల్లగుద్ది మరీ చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోసారి మాక్ ఎలక్షన్స్ నిర్వహించింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో గతంలోలా కాకుండా విభిన్నమైన శైలిని అనుసరించారు. గతంలో అధ్యక్ష అభ్యర్థి పేరును విద్యార్థులకు నేరుగా చెప్పగా, ఈసారి అభ్యర్థుల పేర్లను ఏ, బీ లుగా వ్యవహరించారు. స్కూలులోని విద్యార్థులును ఐదుగురు చొప్పున ఓటింగ్ కు పంపించారు. వారి ఓటింగ్ పూర్తయిన అనంతరం సిబ్బంది ఓట్లను లెక్కించగా, హిల్లరీకి 52 (277 ఓట్లు) శాతం ఓట్లు సాధించగా, డొనాల్డ్ ట్రంప్ 43 (230 ఓట్లు) శాతం ఓట్లు సాధించారు. దీంతో భవిష్యత్ అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికవనుందని ఆ స్కూలు యాజమాన్యం స్పష్టం చేస్తోంది. ఈ ఫలితం నిజమయ్యేదీ, లేనిదీ తేలేందుకు ఎంతో సమయం వేచి చూడాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే!

More Telugu News