: బిర్యానీ అంత రుచిగా లేని ‘బాస్మతి’ రైతు జీవితం!

భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం సినిమాలు, వ్యాపారం, విద్యా సంస్థలు.. ఇలా ప్రతిదానిపై కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి ఉన్న ఆర్ఎస్ పురాలోని బాస్మతి బియ్యం పండించే రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బిర్యానీ అంత రుచిగా ‘బాస్మతి’ పండించే రైతుల జీవితాలు మాత్రం లేవు. ఎందుకంటే, ఇక్కడి పంటలను పండించుకోవాలంటే రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆర్ఎస్ పురనే కాకుండా, దీని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ‘బాస్మతి’ బియ్యం పండించేందుకు అనువైన నేలలు. పాక్ రేంజర్ల కాల్పుల కారణంగా ఈ ప్రాంతంలో సుమారు 17.742 హెక్టార్లలోని వరి పొలాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు రూ.130 కోట్ల విలువ చేసే వరి సాగు అవుతుంటుంది. పాక్ రేంజర్ల కాల్పుల కారణంగా రైతులు పంటను పండించుకోలేకపోతున్నారని, పంట నష్టపోయే పరిస్థితులు దాపురించాయని ఇక్కడి వ్యవసాయ శాఖాధికారి ఒకరు వాపోయారు. పంట పండించాలంటే రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సివచ్చే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు మాట్లాడుతూ, తమ పంటలను ఇంటికి తెచ్చుకునేందుకు చాలా మంది రైతులు అధిక సమయం వెచ్చించి మరీ కష్టపడుతున్నారని, పాక్ రేంజర్ల తూటాలకు తాము ఎప్పుడు బలవుతామోననే భయం వెంటాడుతున్నప్పటికీ, తమ జీవనాధారం వ్యవసాయమే కనుక ప్రాణాలకు తెగించి మరీ పంటలు పండించాల్సి వస్తోందన్నారు. వ్యవసాయకూలీలు, కోత యంత్రాలు రావడానికి ఇష్టపడనప్పటికీ, తమ కుటుంబ సభ్యులతోనే పంట పొలాలకు వెళుతున్నామని మరికొందరు రైతులు చెప్పారు. పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములున్న రైతులు కూడా సంతోషంగా లేరని వారి పొలాల్లో పనిచేసేందుకు కూడా కూలీలు, వ్యవసాయ యంత్రాలు రావడం లేదని అన్నారు. పాక్ తూటాలు, షెల్ లు పొలాలపై వచ్చి పడుతుండడంతో జమ్మూ, సాంబా, కత్వూ జిల్లాల రైతులు పొలాలను వదిలిపారిపోతున్నారు.

More Telugu News