: జీతమిస్తున్నారు కానీ.. పని చేయనీయడం లేదని కోర్టుకెక్కిన టీచర్

జీతంతోపాటు సౌకర్యాలన్నీ ఇస్తున్నారు కానీ, పని మాత్రం చేయనీయడం లేదని అమెరికాలోని మన్ హట్టన్ లో విద్యాశాఖపై డేవిడ్ సూకర్ (48) అనే టీచర్ న్యాయస్థానానికెక్కారు. ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’ నిరసనలో డేవిడ్ సూకర్ పాల్గొని ఓ పోలీసు అధికారితో ఘర్షణ పడ్డాడు. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో 7 వేల డాలర్లు జరిమానా చెల్లించి ఆ కేసు నుంచి బయటపడ్డాడు. దీంతో మన్ హట్టన్ విద్యా శాఖ ఆయనను ఆబ్సెంట్ టీచర్ రిజర్వుడ్ (ఏటీఆర్) కు పంపింది. దీంతో ఆయనకు విధుల్లో ఉన్న టీచర్ కు అందే అన్ని సౌకర్యాలు అందుతాయి. కానీ కేవలం తరగతి గదుల్లో పిల్లలకు పాఠాలు చెప్పే అవకాశమే ఉండదు. ఎవరైనా టీచర్ విధులకు హాజరు కాని పక్షంలో ప్రిన్సిపల్ అనుమతితో ఆయన ఆ రోజు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. లేని పక్షంలో రోజూ విధులకు హాజరు కావాలి కానీ, స్కూల్ లో ఉండాలి. దీంతో ఆయను ఏటీఆర్ లో ఉంచడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 1304 మంది టీచర్లు ఉన్నారు. వీరి కోసం ఏటా 100 మిలియన్ డాలర్లు ఖర్చవుతోంది. దీనిపై ఆయన మన్ హట్టన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీచర్లకు ఇలాంటి మితిమీరిన శిక్షలు విధించే హక్కు మన్ హట్టన్ విద్యాశాఖకు లేదని ఆయన వాదించారు. ఏటీఆర్ కు వెళ్లిన టీచర్లపై కళంకం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ వాదనలు వినిపించిన ప్రభుత్వం తప్పు చేసిన టీచర్లపై చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. ప్రిన్సిపల్ అనుమతిస్తే ఏటీఆర్ లోని టీచర్లు విధులు నిర్వర్తించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. దీనిపై న్యాయమూర్తి తీర్పివ్వాల్సి ఉంది.

More Telugu News