: ‘శామ్ సంగ్’ వాషింగ్ మెషీన్లు పేలుతున్నాయట!

శామ్ సంగ్ కంపెనీ వాషింగ్ మెషీన్లు కూడా పేలుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ప్రతినిధులే ప్రకటించారు. ఇటీవల శామ్ సంగ్ కంపెనీ విడుదల చేసిన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ మోడల్ కు సంబంధించిన ఒక దానిలో లోపం తలెత్తిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ మోడల్ కు సంబంధించిన మెషీన్లను వాలంటరీ రీకాల్ కు పిలుపు ఇస్తున్నట్లు శామ్ సంగ్ సంస్థ ప్రకటించింది. హైస్పీడ్ సైకిల్ సెట్టింగ్ వల్ల వాషింగ్ మెషీన్ లోని డ్రమ్ బ్యాలెన్స్ తప్పడం కారణంగా, విపరీతంగా మెషీన్ వైబ్రేట్ కదలిపోవడంతో దానిపై భాగం ఊడిపోవడం జరుగుతోందంటూ తమకు పలు ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఈ లోపం వల్ల వాషింగ్ మెషీన్ పేలే అవకాశం వుందని అందుకే, వీటిని వాలంటరీ రీకాల్ చేస్తున్నట్లు ‘శామ్ సంగ్’ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, కొన్ని సంఘటనల్లో వాషింగ్ మెషీన్ వినియోగదారులు గాయపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. సదరు కంపెనీ చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికాలోని పలు కోర్టుల్లో ఈ మేరకు కొన్ని కేసులు కూడా దాఖలయ్యాయి. అయితే, శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలిపోయిన సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. అసలే, ఈ సమస్యతో సతమతమవుతున్న ‘శామ్ సంగ్’కు తాజాగా, హైస్పీడ్ వాషింగ్ మెషీన్ల పనితీరు సవ్యంగా లేకపోవడం గమనార్హం.

More Telugu News