: బాలికపై వేధింపుల కేసులో బంగ్లా క్రికెటర్ షాదాత్ హుస్సేన్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

బాలికపై వేధింపుల కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షాదాత్ హుస్సేన్, ఆయన భార్య నృతో షాదాత్‌‌లకు ఊరట లభించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. గతేడాది హుస్సేన్ ఇంట్లో పనిచేసే బాలిక కంటికి గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఏడుస్తూ రోడ్డు పక్కన కూర్చున్న బాలికను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. బాలికను తీవ్రంగా హింసించిన నేరంపై హుస్సేన్, అతడి భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల తర్వాత వారు బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసులో నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేసు విచారణ కొనసాగుతుండడంతో హుస్సేన్ దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడిన హుస్సేన్ 72 వికెట్లు తీశాడు. 51 వన్డేల్లో 47 వికెట్లు పడగొట్టాడు. కోర్టు తీర్పుతో హుస్సేన్ ఆనందం వ్యక్తం చేశాడు. చివరికి సత్యమే గెలిచిందని పేర్కొన్న ఆయన, దేశానికి తిరిగి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు.

More Telugu News