: టీడీపీలోకి కొడాలి నాని కుడిభుజం... వైకాపాలో ఉండలేమని తెగేసి చెప్పిన వైనం!

గత కొంతకాలంగా వినిపించని పార్టీ ఫిరాయింపులు గుడివాడ మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు బ్యాచ్ తెలుగుదేశం కండువాలు కప్పుకోవడంతో మరోసారి తెరపైకి వచ్చాయి. యలవర్తి బ్యాచ్ పార్టీ మారడం వెనుక గుడివాడ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నేత హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. తన అనుంగు శిష్యుడిగా, తన కుడి భుజంగా ఉండే యలవర్తి తెలుగుదేశంలోకి వెళ్లడాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ఎంతమాత్రమూ జీర్ణించుకోలేకుండా ఉన్నారని తెలుస్తోంది. గత రెండు రోజులుగా యలవర్తిని నిలువరించేందుకు నాని ఎంతగా ప్రయత్నించినా, ఫలితం దక్కలేదని తెలుస్తోంది. తాము వైకాపాలో ఉండలేమని తెగేసి చెప్పిన యలవర్తి బ్యాచ్, మరికాసేపట్లో కొనకళ్ల నారాయణతో కలసి సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడే పచ్చ కండువాలు కప్పుకోనున్నారు. వాస్తవానికి మునిసిపల్ ఎన్నికల తరువాత యలవర్తికి చైర్మన్ పదవి దక్కిందంటే, అందుకు కారణం కొడాలి నానీయే. ఇక తాజా పరిణామాలు చూస్తుంటే, గుడివాడ మునిసిపల్ కౌన్సిల్ తెలుగుదేశం పరం అయ్యే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. యలవర్తి ఫిరాయింపుతో వైకాపా బలం 12కు పడిపోనుండగా, టీడీపీ బలం అనూహ్యంగా 23కు పెరగనుంది.

More Telugu News