: ఐటీ వార్‌లో బెంగళూరు వెనక్కి.. దూసుకెళ్తున్న హైదరాబాద్!

ఐటీ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు బెంగళూరు. భారత్‌కు ఐటీ రాజధానిగా అందరికీ సుపరిచితమైన ఈ నగరం క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ-ప్రపంచ బ్యాంక్ సంయుక్తంగా ప్రకటించిన ఈవోడీబీ ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా కర్ణాటక ఏకంగా 13వ స్థానానికి పడిపోయింది. గతేడాది 9వ స్థానంలో ఉన్న కర్ణాటక ఈసారి ఏకంగా నాలుగు స్థానాలు దిగజారడం గమనార్హం. ఈవోడీబీ ర్యాంకులను పక్కనపెడితే ఐటీ ఎగుమతులు, సేవల్లో మాత్రం బెంగళూరు నెంబర్ వన్‌గానే కొనసాగుతోంది. అయితే ఈవోడీబీ ర్యాంకుల ప్రభావంతో బెంగళూరుకు అవకాశాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, సంస్థలకు అనుమతుల మంజూరు విషయంలో జాప్యం తదితర కారణాల వల్లే బెంగళూరు ప్రభ మసకబారుతోందని చెబుతున్నారు. ఈవోడీబీ ర్యాంకుల్లో వెనుకబాటు తమకు శరాఘాతమేనని సాక్షాత్తూ ఆ రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి ఆర్వీ దేశ్‌పాండే కూడా పేర్కొన్నారు. అయితే పెట్టుబడుల ఆకర్షణలో బెంగళూరుదే పైచేయి అని పేర్కొన్న మంత్రి కనీసం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ, గుజరాత్ రాష్ట్రాలు చాలా దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా బెంగళూరులో పరిశ్రమలు విస్తరిస్తున్నంత వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బెంగళూరు కేంద్రంగా స్టార్టప్ ప్రారంభించిన సోమ్‌సింగ్ పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు కూడా సిటీ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

More Telugu News