: ట్రంప్ ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆంధ్రుడు.. రిపబ్లికన్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఇన్‌చార్జ్‌గా అవినాశ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యక్రమంలో తెలుగువాడైన అవినాశ్ ఇరగవరపు(30) కీలకపాత్ర పోషిస్తున్నారు. అరిజోనా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు ప్రస్తుతం ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో పుట్టి పెరిగిన అవినాశ్ లక్నో ఐఐఎం నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. అనంతరం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో చేరారు. అయితే తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై తనకు కాలేజీ రోజుల నుంచే ఆసక్తి ఉండేదని, అదే తననీ స్థాయికి చేర్చిందని అమెరికాలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాశ్ పేర్కొన్నారు. అమెరికాలో ఇంటెల్ సంస్థలో పనిచేస్తున్న తన భార్యను చూసేందుకు 2014లో ఎన్నికల ముగిసిన అనంతరం అవినాశ్ అమెరికా వచ్చారు. ఆ సమయంలో త్వరలో చాండ్లర్ సిటీ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నట్టు తెలుసుకుని అవి ఎలా జరుగుతాయో పరిశీలించారు. ఎన్నికల ఫలితాల డేటాను విశ్లేషించి అరిజోనా గవర్నర్‌గా డౌగ్ డూసీ గెలుస్తారని ఊహించి అతడి ప్రచారకర్తలకు లేఖ రాశారు. ఆయన విశ్లేషించినట్టుగానే డూసీ గెలిచారు. దీంతో రిపబ్లికన్ పార్టీ చైర్మన్ రాబర్ట్ గ్రాహం నుంచి అతడికి ప్రశంసలు వచ్చాయి. అలా రిపబ్లికన్ పార్టీ ప్రచార కార్యక్రమంలో చేరిన ఆయన ఏడాది కాలంలోనే పార్టీ డేటా డైరెక్టర్ పదవి నుంచి పొలిటికల్ డైరెక్టర్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎదిగారు.

More Telugu News