: ‘మీకు ఇదేం రోగం.. చేతులు చాచకుండా బతకలేరా?’.. సిబ్బందిపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్

మేనేజర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వాలిటీ విభాగం టెక్నికల్ అసిస్టెంట్లతో శుక్రవారం నిర్వహించిన భేటీలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైరయ్యారు. టెక్నికల్ స్టాఫ్‌పై విరుచుకుపడ్డారు. లంచాలకు మరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏం రోగం మీకు? చేతులు చాచకుండా పనిచేయలేరా? కార్పొరేషన్ మీకు జీతాలిస్తోంది కదా. అయినా ఇదేం పని?’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిటైరైనా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఎంఎస్ సలీం (కరీంనగర్), భాస్కరరెడ్డి (నల్లగొండ), వి.వెంకటరత్నం (ఖమ్మం), ఎం.బాల్‌రెడ్డి (రంగారెడ్డి)లను విధుల నుంచి తొలగించారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతను పరీక్షించే సిబ్బందిని ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ.. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జీతం తీసుకుంటున్నా అవినీతికి పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. తానొచ్చి రెండున్నర నెలలు అవుతోందని, ఇష్టారాజ్యంగా వ్యవహరించే కొందరు పద్ధతి మార్చుకున్నారని, టెక్నికల్ సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడం లేదని అన్నారు. ‘‘నేనేమో కఠినంగా వ్యవహరిస్తుంటే మీరు మిల్లర్ల నుంచి పర్సెంటేజీలు పెంచుకుంటూ పోతారా? మీ అవినీతి బాగోతం మొత్తం నాకు తెలుసు. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని పనిచేయండి’ అని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఎవరి దగ్గర ఎంతెంత తీసుకుంటున్నారో తన వద్ద అందరి జాతకాలు ఉన్నాయని తెలిపారు. మీ అందరికీ ఇదే చివరి అవకాశం అని, జిల్లా మేనేజర్లు సహా ఎవరినీ వదిలిపెట్టేది లేదని అన్నారు. మిల్లర్లతో డిన్నర్లు చేయవద్దని, లంచాలు తీసుకోవద్దని, నిజాయతీపరులను పీడించవద్దని సిబ్బందికి ఆనంద్ ఉద్బోధించారు.

More Telugu News