: ఏపీలో త్వరలో నిర్వహించే ‘కాలచక్ర’కు దలైలామాను ఆహ్వానిస్తాం: చంద్రబాబు

ఏపీలో త్వరలో నిర్వహించే ‘కాలచక్ర’ ఉత్సవాలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఆహ్వానించనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. పర్యాటక రంగ ప్రగతిపై విజయవాడలోని తన నివాసంలో సీం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కాలచక్ర’ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, విధివిధానాలు రూపొందించాలని, బౌద్ధ గురువుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అమరావతిలో 2006లో దలైలామా ‘కాలచక్ర’ బోధించిన స్థలంలోనే త్వరలో నిర్వహించనున్న ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. సీతానగరం కొండపై అతిపెద్ద బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మొదట్లో అంతర్జాతీయ కూచిపూడి, సంగీత ఉత్సవాలను ఏపీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పర్యాటకుల్ని ఆకర్షించాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యాటక రంగాన్ని ఆకర్షించేందుకు గాను రాయితీలిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ లో పర్యాటక రంగం అభివృద్ధికి అమలు చేస్తున్న విధానాలను మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఏపీ పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాదించారు. గుజరాత్ లో విలాస, వినోద పన్నుపై మూడేళ్ల పాటు వందశాతం మినహాయింపు వ్యవధిని ఐదేళ్లకు పెంచారని, కొన్ని ప్రాజెక్టులకు వంద శాతం విద్యుత్ రాయితీలను కల్పిస్తున్నారని.. మన రాష్ట్రంలో కూడా ఈ విధానాలను అమలు చేయాలని పర్యాటక శాఖ అధికారులు సూచించారు. ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ, సమగ్రంగా పరిశీలించి ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుందామని అన్నారు.

More Telugu News