: ఇంగ్లిష్ భాష నేర్చుకోండి.. వారి మెంటాలిటీ మాత్రం వ‌ద్దు.. మమ్మీ, డాడీ, బీడీ అనకూడదు: వెంక‌య్య

బ్రిటీష్ వారు వారి మెంటాలిటీని భార‌తీయుల‌కు అంటించి వెళ్లారని, ఇంగ్లిష్ భాష నేర్చుకోండి కానీ, వారి మెంటాలిటీ మాత్రం నేర్చుకోవద్దని కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు సూచించారు. తూర్పుగోదావ‌రి జిల్లా సామ‌ర్ల‌కోట‌లో వెంక‌య్య‌కు ఈ రోజు బీజేపీ నేత‌లు స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తెలుగు భాష గొప్ప‌ద‌నాన్ని, భార‌తీయ సంస్కృతిని గురించి చెప్పారు. మమ్మీ.. డాడీ.. బీడీ అని పిల‌వ‌కూడ‌ద‌ని చెప్పారు. బోధ‌న ఆంగ్ల‌మ‌యినా, భావ‌న భార‌తీయ‌మే ఉండాల‌ని చెప్పారు. మ‌న అల‌వాట్లలో భార‌తీయ‌త క‌నిపించాలని అన్నారు. చాలా మంది మ‌న భాష మ‌ర్చిపోతున్నారని, అమ్మ, నాన్న, అక్క‌, బావ అని పిలిస్తేనే చ‌క్క‌గా ఉంటుందని, ఇంగ్లిష్‌లో పిల‌వ‌కూడ‌ద‌ని అన్నారు. క‌న్న త‌ల్లిని, భూమిని, మాతృభాష‌ను మ‌ర్చిపోకూడ‌దని అన్నారు. యావ‌త్ ప్ర‌పంచం మ‌న సంస్కృతిని మెచ్చుకుంటోంద‌ని వెంక‌య్య అన్నారు. మ‌న యాస, గోస, భాష‌, క‌ట్టుబాట్లలో ఎంతో గొప్ప‌ద‌నం ఉంద‌ని చెప్పారు. మ‌లేషియాలోని ఓ ఎయిర్‌పోర్టులో దీపావ‌ళి పండుగ చేసుకున్నారని, ప్ర‌పంచంలోని ఎన్నో ప్రాంతాల్లో దీపావ‌ళి జరుపుకున్నార‌ని, ప్ర‌పంచం మ‌న సంస్కృతిని అనుక‌రిస్తోంటే మ‌నం మ‌ర్చిపోతున్నామ‌ని అన్నారు. యువ‌త స‌క్ర‌మ మార్గంలో న‌డుచుకుంటేనే దేశాభివృద్ధి జ‌రుగుతుంద‌ని అన్నారు. అజ్ఞానాన్ని పూర్తిగా పార‌ద్రోలాలని పిలుపునిచ్చారు. ‘పేప‌ర్ బాయ్ అబ్దుల్ క‌లాం దేశానికి రాష్ట్ర‌ప‌తి అయ్యారు... న‌రేంద్ర మోదీ టీ అమ్మారు, ఇప్పుడు మ‌హానాయ‌కుడు అయ్యారు. ప్ర‌పంచంలోని ఏ దేశం వెళ్లినా మోదీ మోదీ అంటున్నారు. యువ‌త వారిని ఆద‌ర్శంగా తీసుకొని ఎద‌గాలి. భార‌త మాతాకీ జై అంటే దేశంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ జ‌య‌ము క‌లుగుగాక అని అర్థం’ అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

More Telugu News