: వెలుగులోకి ప్రొఫెసర్ లక్ష్మి అరాచకాలు.. సంధ్యారాణి డైరీలో కన్నీరై ప్రవహించిన ఆవేదన

గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులకు బలైపోయిన పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి రాసుకున్న డైరీలో ఆమె ఆవేదన కన్నీరై ప్రవహించింది. ప్రొఫెసర్ వేధింపులను కళ్లకు కట్టినట్టు వివరించింది. ప్రొఫెసర్ లక్ష్మి రాక్షస చర్యలకు తాను ఏ విధంగా నలిగిపోతున్నది అందులో పేర్కొంది. ఆమెను వదలొద్దని, బోధనలో ఆమె ఉండకుండా చూడాలని, తనలా మరే విద్యార్థి బలికాకుండా చూడాలని కన్నీటితో వేడుకుంది. సంధ్యారాణి డైరీలో ఇంకా ఏముందంటే.. ‘‘ప్రొఫెసర్ లక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. ఆమె ఓ సైకో. నాలాంటి వారు ఎందరో ఆమె చేతిలో చిక్కి బాధపడుతున్నారు. ఆమె బోధనలో ఉండకుండా చేయండి. కిందిస్థాయి సిబ్బంది ఆమెకు పురుగులతో సమానం. నా మరణంతోనైనా ఆమెకు శిక్ష పడితే పూర్తిగా చెడిపోయిన జీజీహెచ్ గైనకాలజీ విభాగం బాగుపడుతుందని ఆశిస్తున్నా. నా మరణం పోలీసులకు ఓ ఆయుధం కావాలని కోరుకుంటున్నా’’ అని రాసిన సంధ్యారాణి తండ్రిని ఉద్దేశించి.. ‘‘నీ కలలు నెరవేర్చలేకపోతున్నందుకు నాన్నా నన్ను క్షమించు. అమ్మని, అక్కని జాగ్రత్తగా చూసుకో. ఒక్కసారి ఇంటికి రావాలని ఉన్నా ఇక్కడ సెలవు ఇచ్చే వారు లేరు. నన్ను క్షమించు నాన్నా. నా మానసిక స్థితి పూర్తిగా భరించలేని స్థితికి చేరుకుంది. అందుకే ఈలోకం విడిచి వెళ్లిపోతున్నా’’ అని డైరీలో పేర్కొంది. భర్తను ఉద్దేశించి ‘‘ నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. నేను ఈ లోకంలో బతికేందుకు ఇష్టపడడం లేదు. మా అమ్మను, నాన్నను కూడా చూడు. రోజూ తిట్లు భరించడం నావల్ల కాదు. ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. నాకే ఎందుకిలా జరుగుతోంది? నీవు మాత్రం జీవితంలో కుంగిపోవద్దు’’ అని పేర్కొంది. అన్నయ్యను ఉద్దేశించి..‘‘ అన్నయ్యా, చిన్నీ.. ఈ ప్రపంచంలో మీరు నా నిజమైన స్నేహితులు. టార్చర్ భరించలేకపోతున్నా. రోజూ ఏడ్చిఏడ్చి కుంగిపోయా. ఈ లైఫ్‌ను భరించలేను. నేను వెళ్లిపోయానని బాధపడొద్దు. మమ్మీ, డాడీలను బాగా చూసుకో. వారికి రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించు’’ అంటూ కన్నీరు సుడులు తిరుగుతుండగా తన బాధను డైరీలో పెట్టింది. మూడు దశాబ్దాలుగా జీజీహెచ్‌లో పనిచేస్తున్న లక్ష్మి మంచిదని ఆమె వద్ద పనిచేసిన ఒక్కరు కూడా విచారణ కమిటీ ముందు చెప్పకపోవడం ఆమె అరాచకాలకు అద్దం పడుతోంది. సంధ్యారాణి ఆత్మహత్య అనంతరం పరారీలో ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

More Telugu News