: కరాచీలో ఘోర రైలు ప్రమాదం..17 మంది దుర్మరణం

పాకిస్థాన్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాక్ ఆర్థిక రాజధాని కరాచీలోని లండి రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న జకారియా ఎక్స్ ప్రెస్, ఫరీద్ ఎక్స్ ప్రెస్ లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు బోగీలు నుజ్జునుజ్జయిపోయాయి. బోగీలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లోపలి వారిని వెలుపలికి తీశారు. అయితే, ప్రమాదం జరగడానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రులను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. మరోవైపు, పాకిస్థాన్ లో రైల్వే వ్యవస్థ అత్యంత ఘోరంగా ఉంది. వలస పాలకులైన బ్రిటీష్ వారు అప్పట్లో వేసిన వేలాది కిలోమీటర్ల ట్రాక్, వారు వదిలి వెళ్లిన రైళ్లనే ఇప్పటికీ పాక్ వాడుతోంది. పాకిస్థాన్ స్వయం పాలనలో అక్కడి రైల్వే వ్యవస్థ దారుణంగా తయారైంది. సరైన మేనేజ్ మెంట్ లేకపోవడం, రైల్వే శాఖకు నిధులను కేటాయించకపోవడం వంటి కారణాలతో వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఈ కారణంగానే పాకిస్థాన్ లో తరచుగా రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

More Telugu News