: ఇరాకీ దళాలకు ఎదురొడ్డండి.. పారిపోయి పిరికిపందలుగా మారొద్దు.. ఉగ్రవాదులకు ఐఎస్ చీఫ్ వీడియో సందేశం

మోసుల్‌ను చుట్టుముట్టిన ఇరాకీ దళాలకు ఎదురొడ్డి పోరాడాలని ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ తన ఫైటర్లకు ఓ వీడియో సందేశం ద్వారా పిలుపు నిచ్చాడు. ‘పారిపోవద్దు.. పోరాడండి’’ అని అందులో పేర్నొన్నాడు. ఐఎస్ అనుబంధ అల్-ఫర్ఖాన్ మీడియా గురువారం ఈ వీడియోను విడుదల చేసింది. ఐస్ చెరలో ఉన్న మోసుల్ నగరాన్ని విడిపించేందుకు దూసుకొచ్చిన సంకీర్ణ దళాలు మోసుల్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దళాల ధాటికి తోక ముడుస్తున్న ఉగ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధాలతో ఎదురొడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అబు బకర్ కూడా సేనల అధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తాజాగా విడుదలైన వీడియోలో ఐసిస్ చీఫ్ మాట్లాడుతూ ‘‘మీ గడ్డను వదలొద్దు. పారిపోయి సిగ్గుమాలిన పని చేయడం కంటే పోరాడి నిలవడం వెయ్యి రెట్లు గౌరవం’’ అని ఫైటర్లను ఉద్దేశించి పేర్కొన్నాడు. ప్రస్తుతం అబూ బకర్‌ను ఇరాకీ సేనలు చుట్టుముట్టినట్టు తెలుస్తున్నా మిగతా వివరాలు మాత్రం తెలియరావడం లేదు. రెండేళ్లుగా మోసుల్‌ను అడ్డాగా చేసుకుని ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఐఎస్ పునాదులు గత కొన్ని రోజులుగా కదులుతున్నాయి. సంకీర్ణ సేనల అండతో ఇరాకీ దళాలు ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో ఉగ్రవాదులను తుదముట్టించాయి. దళాల ధాటికి నిలవలేని ఉగ్రవాదులు గడ్డాలు తీసేసి మరీ పరుగులు పెడుతుండడం విశేషం.

More Telugu News