: ఇక బస్టాండ్లలోనూ ప్లాట్‌ ఫ్లాం టికెట్.. ప్రయాణికుల జేబులు గుల్లచేసేందుకు సిద్ధమవుతున్న టీఎస్ ఆర్టీసీ!

సాధారణంగా ప్లాట్ ఫాం టికెట్ అనగానే గుర్తొచ్చేది రైల్వే స్టేషనే. లోపలికి వెళ్లాలంటే అది తప్పనిసరి. కానీ ఇక నుంచి తెలంగాణలోని బస్టాండ్లలోకి వెళ్లాలన్నా ప్లాట్‌ ఫాం టికెట్ ఉండాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ఆర్టీసీ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించింది. కేవలం బస్సు చార్జీలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో అమలవుతున్న ప్లాట్ ఫాం టికెట్ విధాన్ని బస్టాండ్లలోనూ అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. టికెట్ ధర రూ.5 ఉండొచ్చని తెలుస్తోంది. మొదట ఈ విధానాన్ని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్లు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. నగరంలోని ఎంజీబీఎస్ నుంచే రోజూ లక్షమంది ప్రయాణిస్తుంటారు. వీరికి సహాయకులుగా మరో 20 వేలమంది బస్టాండ్‌కు వస్తుంటారని అంచనా. ఈ లెక్కన ఒక్క ఎంజీబీఎస్ నుంచే కనీసం 5 లక్ష రూపాయల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. తొలుత పెద్ద బస్టాండ్లలో ప్లాట్ ఫాం టికెట్ విధానాన్ని అమలు చేసి క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. నిజానికి ఆర్థిక భారంతో సతమతమవుతున్న ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలని భావించినా ప్రయాణికులపై భారం మోపేందుకు ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా ప్లాట్ ఫాం టికెట్ విధానం వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

More Telugu News