: చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ రాజీ పడ్డారని నేను భావించడం లేదు: కవిత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ ను వదిలి వెళ్లడం ఆయన సొంత విషయమని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. అయితే, ఆయన అక్కడకు వెళ్లిపోవడం చాలా మంచి నిర్ణయమని... ప్రజలకు దగ్గరగా పాలన ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అక్కడ ఉండటం వల్ల పాలన వేగవంతమవుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దేశంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంతో పోటీ పడాలని... అప్పుడు ఇరు రాష్ట్రాలూ ఎదుగుతాయని చెప్పారు. ఏపీ కూడా బాగా అభివద్ధి చెందాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు. ఓ వార్తా ఛానల్ కు ఇంటర్వ్యూలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ రాజీ పడ్డారని తాను భావించడం లేదని కవిత అన్నారు. కేసులను లీగల్ ఇష్యూగా ప్రారంభించేంత వరకే మన చేతిలో ఉంటుందని.. ఆ తర్వాత మన ప్రమేయం ఉండదని తెలిపారు. మనం తొందరపడినంత మాత్రాన కేసులు తేలవని చెప్పారు. లీగల్ వ్యవహారాలు ఎలా కొనసాగుతాయో అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు.

More Telugu News