: భారత్‌లో భారీ దాడులకు ఐఎస్ వ్యూహం.. అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు అమెరికా హెచ్చరిక

భారత్‌లో భారీ దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ వ్యూహం రచించిందని, జాగ్రత్తగా ఉండాలంటూ తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లోని పాశ్చాత్య దేశాల పౌరులకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. పౌరులకు పటిష్ట భద్రత కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత్‌లో భారీ దాడులకు ఐఎస్ కుట్ర పన్నినట్టు తమకు సమాచారం అందిందని పేర్కొన్న అమెరికా కీలక సూచనలు చేసింది. విదేశీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. రద్దీ ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్ల వద్ద సంచరించవద్దని పౌరులకు సూచించింది. సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని పేర్కొంది. కాగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల నుంచి భారత్‌కు ముప్పు ఉందని తెలుస్తోంది. అయితే భారత నిఘా వర్గాల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలు విడుదల కాలేదు. అమెరికా దళాలతో కలిసి ఇరాకీ సేనలు ఐఎస్‌కు గట్టిపట్టున్న మోసుల్ నగరంపై విరుచుకుపడుతుండడంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఐఎస్ ఉగ్రవాదులు అమెరికన్లు నివసించే దేశాల్లో దాడులకు పాల్పడాలని యోచిస్తున్నట్టు నిఘావర్గాల సమాచారం.

More Telugu News