: ఐఎస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న ఇరాక్ సైన్యం.. మోసుల్ స్వాధీనానికి సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం

ఐఎస్ ఉగ్రవాదులకు కంచుకోట అయిన మోసుల్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కదిలిన ఇరాక్ ప్రత్యేక దళాలు మంగళవారం నగర సరిహద్దుల్లోకి చేరుకున్నాయి. ఐఎస్ ఉగ్రవాదులను ఏరివేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఉగ్రవాదుల నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వ దళాలు ముందుకు కదులుతున్నాయి. ఇరాక్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మోసుల్‌లోకి గత రెండేళ్లలో ప్రభుత్వ దళాలు అడుగుపెట్టడం ఇది మొదటిసారి కావడం గమనార్హం. ఉగ్రవాదుల కోసం ఇల్లిల్లూ గాలించాల్సిన పరిస్థితి ఉండడంతో ఆపరేషన్ కొంచెం నెమ్మదిగా సాగుతోంది. మోసుల్ పరిధిలోని గాగ్జలిలో సైన్యం అడుగుపెట్టినట్టు ఇరాక్ ప్రత్యేక దళాల మేజర్ జనరల్ సమి అల్-అరిడి తెలిపారు. నగరంలోని రోడ్లపై ఉగ్రవాదులు బాంబులు అమర్చడంతో ఆచితూచి ముందుకు వెళ్లాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఫిరంగులు, ట్యాంకులు, మెషిన్ గన్లతో ఇరాక్ దళాలు ఐఎస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నాయి. దీనికి స్పందనగా ఉగ్రవాదులు యాంటీ ట్యాంక్ మిసైల్స్, తేలికపాటి ఆయుధాలతో సైన్యాన్ని ప్రతిఘటిస్తున్నారు. అదే సమయంలో అమెరికా సంకీర్ణ దళాలు వాయు దాడులతో ఐఎస్ స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. మరో రెండు మూడు రోజల్లో మోసుల్ నుంచి ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News