: కాపుల ఓట్లపై జనసేన దృష్టి.. పవన్ నిర్ణయంతో టీడీపీలో గుబులు

జనసేన అధినేత తాజా నిర్ణయం టీడీపీలో గుబులు రేపుతుందా? అంటే, అవుననే అంటున్నారు విశ్లేషకులు. టీడీపీకి కంచుకోటలాంటి ఏలూరులో ఓటు నమోదు చేసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. తాను ఏలూరులో ఉండేందుకు అనువైన ఇల్లు చూడాలని పవన్ చెప్పినట్టు పేర్కొన్న జనసేన కార్యకర్తలు ఇల్లు వెతికే పనిలో పడ్డారు. పవన్ ఇక్కడ ఉండాలనుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా పవన్ ఒంటరిగా బరిలోకి దిగితే జిల్లాలో తమకు భారీ నష్టం తప్పదని టీడీపీ నేతలు ఇప్పటి నుంచే భయపడుతున్నారు. నిజానికి పశ్చిమగోదావరి జిల్లా మెగా బ్రదర్స్ సొంత జిల్లా. చిరంజీవి మొగల్తూరులో పుట్టి పెరగగా పవన్ మాత్రం బాపట్లలో పుట్టి నెల్లూరులో పెరిగారు. ఉద్యోగ రీత్యా తండ్రి బదిలీ కావడంతో పవన్‌కు ఈ ప్రాంతంతో పెద్దగా అనుబంధం లేదు. ఇక ప్రత్యేక హోదాపై గళమెత్తిన పవన్ తొలుత తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించగా తర్వాత కాకినాడలో పెట్టారు. ఇప్పుడు ఏలూరులో ఓటు నమోదు చేసుకోవాలని ఆయన భావించడం ఇందుకు కొనసాగింపేనని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచీ పార్టీని బలోపేతం చేసేందుకే ఆయన ఏలూరును ఎంచుకున్నట్టు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కాపు ఓట్లపైన కూడా పవన్ దృష్టి సారించినట్టు సమాచారం. కాపులు బలంగా ఉన్న జిల్లా కావడంతోనే పవన్ ఇక్కడ ఓటుహక్కు నమోదుకు ఆసక్తి చూపిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తనను ఓ కులానికి పరిమితం చేయడం తగదని గతంలో పేర్కొన్న పవన్ ఇప్పుడు కాపులు బలంగా ఉన్న జిల్లానే తన తదుపరి కార్యాచరణకు ఎంచుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News