: ఆంధ్ర అనే పదానికి కాలం చెల్లిపోయింది... ఇంకా అలాంటి మాటలు వ‌ద్దు: రేవంత్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీ తెలంగాణ‌లో పుట్టి.. తెలంగాణ‌లో పెరిగిన పార్టీ అని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. అటువంటి పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చి తెలంగాణ‌లో రాలేద‌ని వ్యాఖ్యానించారు. త‌మ పార్టీ ఆంధ్ర పార్టీ అని ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఆంధ్ర అనే ప‌దానికి కాలం చెల్లిపోయింద‌ని, ఇంకా అలాంటి మాట‌లు వ‌ద్ద‌ని సూచించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్‌లో మంత్రులుగా ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌రావు, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ తెలంగాణ వ్య‌తిరేకులు కాదా..? అని ప్ర‌శ్నించారు. పార్టీ విధానాల‌కు క‌ట్టుబ‌డే త‌మ‌ పార్టీ న‌డుస్తోందని చెప్పారు. తెలంగాణ‌లో రైతుల‌కు పూర్తి రుణ‌మాఫీ చేసే వ‌ర‌కు తాము పోరాడ‌తామ‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే, కేవ‌లం 300 రైతుల కుటుంబాల‌కు మాత్ర‌మే రూ.6 ల‌క్ష‌ల ప‌రిహారం ఇచ్చార‌ని అన్నారు. ప్ర‌భుత్వం నుంచి రైతుల‌కు భ‌రోసా క‌రవైంద‌ని అన్నారు. రైతుల కష్టాల‌ను తెలుపుతూ ప్రొ.కోదండ‌రాం ఇటీవ‌ల ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టిన సంద‌ర్భంగా తెలిపిన అజెండాను నూరుశాతం అమ‌లు చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కోదండ‌రాం చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఒప్పుకున్నామ‌ని, రైతుల‌ను ఆదుకునేందుకు ఆయ‌న ఇప్పుడు చేసిన ప్ర‌తిపాద‌న‌లను కూడా గౌర‌విస్తామ‌ని చెప్పారు. రైతుల ప‌క్షాన పోరాడుతూ తాము తెలంగాణ‌లోని అన్ని జిల్లాలలో ప‌ర్య‌టిస్తామ‌ని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. టీజేఏసీ అజెండాకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

More Telugu News