: ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వంపై బీజింగ్‌లో భారత్, చైనా అధికారుల భేటీ

న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్‌జీ)లో భారత్ కు సభ్యత్వంపై అమెరికా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కొన్ని నెల‌ల క్రితం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన ప్లీనరీలో ఈ అంశంపై అమెరికా నుంచి సానుకూలత వచ్చినా చైనా మాత్రం అడ్డుతగిలి ఎన్‌పీటీ నిబంధ‌న‌ల‌పై భార‌త్‌ సంతకం చేస్తేనే ఇందుకు తాము ఒప్పుకుంటామ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఎన్ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం విషయంపై చైనాతో భారత్ నిన్న చర్చలు జరిపింది. ఈ ఏడాది సెప్టెంబ‌రు 13న‌ చైనా ఆయుధాల నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ వాంగ్‌ కున్‌తో బీజింగ్‌లో చ‌ర్చ‌లు జ‌రిపిన భారత సంయుక్త కార్యదర్శి అమన్‌దీప్‌ సింగ్‌ గిల్ నిన్న మ‌రోసారి సమావేశమయి ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నార‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా చైనాకు భార‌త్ ప‌లు అంశాల‌ను తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భార‌త్ సంతకం చేయకపోయినా, అందులోని అంశాల‌ను మాత్రం భార‌త్ పాటిస్తూనే ఉంద‌ని చెప్పింది. అర్జెంటీనా రాయబారి రఫెల్‌ గ్రోస్సీ ఆధ్వ‌ర్యంలో మరో రెండు నెలల్లో అనధికారికంగా ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం అంశంపై భార‌త్ చ‌ర్చ‌ల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే భారత్, చైనా మ‌ధ్య ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి.

More Telugu News