: కర్నూలు జిల్లాలో రచ్చకెక్కిన టీడీపీ విభేదాలు... భూమా, శిల్పా వర్గీయుల వాగ్వాదం

మొన్నటి వరకూ వేర్వేరు పార్టీల్లో ఉండి, ఇప్పుడు ఒకే పార్టీలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న భూమా నాగిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిల మధ్య వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. నంద్యాల మునిసిపల్ సమావేశాలు నేడు జరుగగా, భూమా, శిల్పా వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమణలు, రోడ్ల విస్తరణ అంశాలపై వివాదం తలెత్తగా, నందికొట్కూరులో కేజీ రోడ్డును 120 అడుగుల మేరకు విస్తరించాలని తీర్మానం చేయడంతో గొడవ మరింతగా పెరిగింది. మునిసిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని హైవే అథారిటీకి అధికారులు పంపగా, దీన్ని భూమా నాగిరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. శిల్పా సోదరుల అనుచరుల వ్యాపారాలు బాగా సాగేందుకే రోడ్ల విస్తరణను తెరపైకి తెచ్చారని భూమా వర్గీయులు బాహాబాహీకి దిగడంతో మునిసిపల్ కౌన్సిల్ సమావేశం మధ్యలోనే ముగిసింది. కౌన్సిల్ హాల్ బయటే ఉన్న పోలీసులు ఇరు వర్గాలకూ సర్ది చెప్పి పంపించి వేశారు.

More Telugu News