: ‘కాల్ సెంటర్ స్కామ్’కు సహకరించిన వ్యక్తుల్లో తెలుగు ఎన్ఆర్ఐ భోగవల్లి నరసింహ

పన్ను ఎగవేతలకు పాల్పడినందుకు మీపై వారంట్లు పెండింగ్ లో ఉన్నాయంటూ కొంతమంది అమెరికన్ పౌరులకు ఫోన్లు చేసి మరీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్న నకిలీ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారుల బాగోతం గుర్తుండే ఉంటుంది. పూణె కేంద్రంగా సాగిన ఈ ‘కాల్ సెంటర్ స్కాం’కు సహకరించిన వ్యక్తుల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐ భోగవల్లి నరసింహ (50)ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ కు సంబంధించి మనదేశంలో పనిచేసిన వ్యక్తి షాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ. అయితే, ఈ స్కామ్ అమెరికాలో సవ్యంగా సాగేందుకు సహకరించిన ప్రధాన వ్యక్తుల్లో ఒకరిగా భోగవల్లి నరసింహను పోలీసులు గుర్తించారు. ఇతను హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అని సమాచారం. నరసింహను అమెరికా కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ జరిగే వరకు పోలీసుల అదుపులోనే ఆయన్ని ఉంచాలని మేజిస్ట్రేట్ పాల్ డి స్టిక్నీ ఆదేశించారు. కాగా, మొదట్లో ఐబీఎంలో పనిచేసిన ఆయన, ఆ తర్వాత సొంతంగా ‘టెక్ డైనమిక్స్’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రెసిడెంటుగా కూడా భోగవల్లి లిస్ట్ అయినట్లు సమాచారం. టెక్సాస్ లోని ఇర్వింగ్ లో ఉన్న టచ్ స్టోన్ కమోడిటీస్ లో భోగవల్లి నరసింహ డైరెక్టర్ గా ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. తమది ఎగుమతులు, దిగుమతుల సంస్థ అని, ఆ సంస్థ పేరున అకౌంటు తెరిచే సమయంలో పేర్కొన్నారు. అయితే, కంపెనీకి సంబంధించి వెబ్ సైట్ లో మాత్రం ఇనుప ఖనిజం, స్టీలు వంటి ఖరీదైన ఉత్పత్తులను సరఫరా చేస్తుందని, భోగవల్లి ఆ సంస్థ చైర్మన్ అని పేర్కొన్నారు.

More Telugu News