: తొలగించబడ్డా మిస్త్రీయే పలు టాటా కంపెనీల చైర్మన్... స్వచ్ఛంద రాజీనామా కోరుతున్న టాటాలు

టాటా గ్రూప్ లోని కంపెనీల మాతృసంస్థ టాటా సన్స్ నుంచి సైరస్ మిస్త్రీని తొలగించినా, ఇప్పటికీ అధికారికంగా పలు టాటా కంపెనీల చైర్మన్ గా ఆయన పేరే ఉంది. మొత్తం 103 బిలియన్ డాలర్ల విలువైన గ్రూప్ లోని పలు కంపెనీల నుంచి నైతికతకు కట్టుబడి ఆయనే స్వయంగా రాజీనామా చేస్తారని ఆశిస్తున్నట్టు టాటా గ్రూప్ వర్గాలు వెల్లడించాయి. ఇక గ్రూప్ లోని పలు కంపెనీలు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ, టాప్ మేనేజ్ మెంట్ మారినంత మాత్రాన కంపెనీ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులూ జరగబోవన్న సంకేతాలు వెలువరుస్తున్నాయి. టాటా స్టీల్ సంస్థ అనలిస్టులతో సమావేశం నిర్వహించి యూరోపియన్ ఉక్కు వ్యాపారంలో భాగంగా ముందుగా అనుకున్న ఏ ప్రణాళికపైనా మిస్త్రీ తొలగింపు ప్రభావం వుండదని స్పష్టం చేసింది. కెనడా ఐరన్ ఓర్ మైనింగ్ సంస్థతో వ్యూహాత్మక ఒప్పందంపైనా వెనుకంజ లేదని తెలిపింది. ఇక మిస్త్రీ తొలగింపు ప్రభావం గ్రూప్ కంపెనీలపై పెద్దగా ఉండదని తెలుస్తుండటంతో గత నాలుగు రోజుల భారీ పతనం తరువాత టాటా సంస్థలు ఈ రోజు లాభాల్లో నడుస్తున్నాయి. టాటా కంపెనీల ఈక్విటీలకు కొనుగోలు మద్దతు కనిపిస్తోంది. శుక్రవారం నాటి సెషన్లో టాటా మోటార్స్ 3 శాతం, టాటా స్టీల్ 2 శాతానికి పైగా లాభాలను ఆర్జించాయి.

More Telugu News