: నదిలో మునిగిపోతున్న భార్యను ఎందుకు కాపాడారని గజ ఈతగాళ్లపై విరుచుకుపడ్డ భర్త!

అహ్మదాబాద్ లోని సబర్మతీ నదీ తీరంలో నియమించబడిన ఫైర్ అండ్ ఎమర్జెన్సీ విభాగం గజ ఈతగాళ్లకు వింత అనుభవం ఎదురైంది. ఓ మహిళ నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఆమెను కాపాడిన ఈ ఉద్యోగులు, ఆమె భర్త నుంచి తిట్లు తినాల్సి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్ లోని వల్లభ్ సదన్ వెనుకవైపున్న సబర్మతీ నదిలో మిథఖాలి ప్రాంతానికి చెందిన 37 సంవత్సరాల మహిళ నీటిలోకి దూకింది. దీన్ని చూసిన భరత్ మంగేలా అనే ఫైర్ మన్ నదిలోకి దూకి కాపాడాడు. తన భార్య ఆత్మహత్యాయత్నాన్ని, ఆపై వీరు కాపాడటాన్ని చూసిన ఆమె భర్త వచ్చి తగవులాట పెట్టుకున్నాడు. "అమె భర్త వచ్చి మమల్ని ప్రశ్నించాడు. తన భార్య ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవడానికి మీరెవరని అడిగాడు. మా ఫోటోలు తీసుకుని, తరువాత మీ సంగతి చూస్తానంటూ బెదరించాడు. దీంతో మేము విషయాన్ని పోలీసులకు చెప్పాలని నిర్ణయించాం" అని భరత్ మంగేలా వెల్లడించారు. అతని ప్రవర్తన తమకు షాక్ కలిగించిందని, ఎవరినైనా కాపాడితే, తమకు ప్రశంసలు లభిస్తాయిగానీ, తమకు తిట్లు ఎదురయ్యాయని చెప్పాడు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వీరికి వివాహమై 10 సంవత్సరాలు గడిచిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఓ సీఎన్జీ పంప్ స్టేషన్ నిర్వహిస్తున్న నిందితుడికి, అతని భార్యకూ మధ్య విభేదాలు వచ్చాయని, తన భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు.

More Telugu News