: గడ్డాలు తీసేసి, ఆడాళ్లలా బురఖాలు ధరించి పలాయనం చిత్తగిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు

ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ కు చివరి రోజులు నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు 'ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తాం. షరియత్ చట్టాన్ని అమలు చేస్తాం, ఇస్లాం కోసం ప్రాణాలు ఫణంగా పెడతాం' అంటూ ప్రగల్భాలు పలికి, వందలాది మందిని అకారణంగా హత్యచేసిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, ఇప్పుడు పరిస్థితులు తమ ప్రాణాల మీదకే వచ్చేసరికి... గడ్డాలు తీకేసి, ఆడవారిలా బురఖాలు ధరించి పలాయనం చిత్తగిస్తున్నారు. ఇరాక్ లోని సంకీర్ణసేనలు, కుర్దు దళాల చేతిలో చావుదెబ్బలు తింటున్నారు. రెండేళ్లుగా ఆయుధాలతో భయపెట్టి, బానిసలుగా చేసుకున్నవారితో తవ్వించుకున్న సొరంగాల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. గతంలో విధించిన శిక్షలు అమలు చేసేందుకు తవ్విన బందిఖానాల్లో బందీలుగా మారిపోయి, డ్రామాలు ఆడుతూ, బ్రతుకు జీవుడా అంటూ పారిపోతున్నారు. సాక్షాత్తూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ బురఖా ధరించి సిరియా పారిపోయాడని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఏలిన నగరాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న సంకీర్ణసేనలు, సొరంగాల్లో దాక్కున్న ఉగ్రవాదులను వెలికి తీస్తోంది. సంకీర్ణసేనలు ప్రయోగిస్తున్న పొగ బాంబులకు కలుగుల్లోని ఎలుకల్లా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బయటకి పరుగులు తీస్తూ, తూటాలకు బలవుతున్నారు. ఈ క్రమంలో వారి నుంచి ఆయుధాలు, ట్యాంకర్లు, ఇతర యుద్ధ సామగ్రిని సంకీర్ణసేనలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇరాక్ లో ఇంచుమించు వారి పీడ విరగడైపోవడంతో సిరియాలో కూడా వారికి స్థానం లేకుండా చేయాలని కోరుతున్నారు.

More Telugu News