: ఏవోబీ ఎన్ కౌంటర్ పై మావోయిస్టుల ఆడియో విడుదల.. పోలీసుల అదుపులో ఉన్న మావోలను చిత్ర హింసలు పెడుతున్నారని ఆరోపణ

ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు ఆడియో విడుదల చేశారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు కైలాసం పేరుతో 10 నిమిషాల ఈ ఆడియో ఉంది. మల్కాన్ గిరి ఎన్ కౌంటర్ ఒట్టి బూటకమని ఈ ఆడియోలో కైలాసం పేర్కొన్నారు. ఏకపక్షంగా కాల్పులు జరిపి మావోయిస్టులను పోలీసులు హత్య చేశారని తెలిపారు. ఎన్ కౌంటర్ కు తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఎన్ కౌంటర్ కు ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కొందరు మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు పట్టుకున్నారని ఆడియోలో కైలాసం ఆరోపించారు. అదుపులో ఉన్న మావోలను పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నారని... వారి నుంచి సమాచారం సేకరించాక, ఎన్ కౌంటర్ చేసి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. అయితే, పోలీసుల అదుపులో ఆర్కే ఉన్నాడన్న విషయంపై తమ వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేదని చెప్పారు. ఎన్ కౌంటర్ పై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

More Telugu News