: తిరుపతిలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న భార్యాభ‌ర్త‌లు!

చాలామంది భార్యాభ‌ర్త‌లు ఉద‌యాన్నే లేచి స్నానం చేసి, త‌యార‌యి ఆఫీస్‌కి వెళ్లిపోవ‌డం, మ‌ళ్లీ సాయంత్రం ఇంటికి రావ‌డం మ‌నం ప‌ట్ట‌ణాల్లో చూస్తుంటాం. అయితే, తిరుప‌తి న‌గ‌రంలో తిరుగుతున్న ఈ భార్యాభ‌ర్తల రూటు సెప‌రేటు. అందరిలాగే ఉద‌యాన్నే ఎంచ‌క్కా త‌యారై ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బ‌య‌లుదేరుతారు. అయితే, ఆఫీసుకి కాదు.. దొంగ‌త‌నాలు చేయ‌డానికి. ద్విచ‌క్ర‌వాహ‌నంపై బ‌య‌లుదేరి ప‌లు వీధుల్లో చ‌క్కర్లు కొట్టి, ఏ ఇంటికి తాళం వేసి ఉందో గ‌మ‌నిస్తారు. ఆధునిక పరికరాల సాయంతో తాళాలు కట్‌చేసి ఇంట్లో చోరీ చేస్తారు. చేసే ప‌నిని ఎంత శ్ర‌ద్ధ‌గా, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా చేస్తారంటే వారు దొంగ‌ల‌న్న అనుమానం ఎవరికీ క‌ల‌గ‌దు. వీరు ఆ ఇంట్లోని కుటుంబసభ్యులేనని స్థానికులు నమ్మేలా వారు సినిమా దృశ్యాలను త‌ల‌ద‌న్నేలా న‌టిస్తారు... కాదు.. జీవిస్తారు. ఈ భ‌లేదొంగ‌ల్ని తిరుప‌తి పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వారు ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలని చెప్పారు. గ‌తంలో వారికి జైలులో గ‌డిపిన‌ చరిత్ర కూడా ఉంద‌ని, అయినా బుద్ధి మార్చుకోలేద‌ని చెప్పారు. ఈ భార్యాభ‌ర్త‌లు చెన్నైకు చెందిన కరుణప్రభు(32), అతని భార్య సౌమ్య(32)గా పోలీసులు చెప్పారు. ఐదు నెలల క్రితం తిరుపతి నగరంలోని రామానుజపల్లెలో ఇంటిని అద్దెకు తీసుకుని అందులో నివాసం ఉంటూ, ఇలా ద్విచక్రవాహనంపై నగరంలో తిరుగుతూ చోరీల‌కు పాల్ప‌డుతున్నార‌ని పోలీసులు పేర్కొన్నారు. తిరుప‌తి న‌గ‌రంలోని మంగళం, సుబ్బారెడ్డినగర్‌, కొర్లగుంట, ఎం.ఆర్‌.పల్లి, రామచంద్రనగర్‌, జయశంకర్‌కాలనీ, తిరుచానూరు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వీరు చోరీల‌కు పాల్ప‌డ్డార‌ని చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకొని గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి రేణిగుంట-చంద్రగిరి రహదారిలోని బస్‌స్టాప్‌లో వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు చెప్పారు. వారి వ‌ద్ద నుంచి రూ.18 లక్షల విలువ చేసే 500 గ్రాముల బంగారం, ఏడు కిలోల వెండి, విలువైన చీరలు, ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నామ‌ని పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభ‌వించి, బెయిలుపై విడుద‌లై ఈ భార్యాభ‌ర్త‌లు మ‌ళ్లీ చోరీలకు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News