: కోవర్టు ఆపరేషన్ తో పోలీసుల పక్కా ప్లాన్... ఉచ్చులో పడిన మావోలు!

ఏవోబీలో మావోయిస్టులకు అత్యంతపట్టున్న మల్కన్ గిరి జిల్లాలోకి పోలీసులు ఎలా చేరగలిగారు? మావోయిస్టులను ఎలా మట్టుబెట్టగలిగారు? అన్నదానికి ‘కోవర్టు ఆపరేషన్‌’ కారణమని మావోయిస్టు వర్గాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఈ ‘కోవర్టు ఆపరేషన్‌’ ఎలా జరిగింది? అన్న వివరాల్లోకి వెళ్తే... మావోయిస్టు స్పెషల్‌ జోనల్‌ కమిటీ పరిధిలోని ఓ డివిజన్‌ కమిటీ స్థాయి నాయకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ఇన్‌ ఫార్మర్ల ద్వారా ఎస్‌ఐబీకి ఆగస్టులో సమాచారం అందించాడు. దీంతో మావోల ఆటకట్టించాలంటే అతని అవసరం ఉంటుదని భావించిన పోలీసులు, ఆయన వ్యవహారాన్ని పరిశీలించి, ఆయనకు వైద్యం చేయించి, తిరిగి సురక్షితంగా కోరాపుట్‌ కు పంపించారు. ఈ సమయంలో ఆయన శరీరానికి చిప్ అమర్చారు. అలాగే అతనికి అత్యంత అధునాతన జీపీఎస్ పరికరాలు సమకూర్చారు. వీటిని ట్రాక్ చేసుకుంటూ కూర్చున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ రెండో వారంలో ఆర్కే దండకారణ్యం నుంచి ఏవోబీకి తిరిగొచ్చారు. ప్లటూన్‌ కమాండ్‌ 1, 2 ముఖ్యులతో మల్కన్‌ గిరి ప్రాంతంలోనే సమావేశం నిర్వహించి, ఏవోబీ రాష్ట్ర కమిటీ, ప్రత్యేక జోనల్‌ కమిటీ, ప్రత్యేకించి కోరాపుట్‌, పెదబయలు, మల్కన్‌ గిరి తదితర జిల్లా, డివిజన్‌, ఏరియా కమిటీల పరిధిలో పార్టీ కార్యాచరణను మరింతగా పటిష్ఠంగా చేపట్టాలని ఆదేశించారు. దీనిపై చర్చించేందుకు ప్లీనరీ నిర్వహించాలని దానికి బెజింగి ప్రాంతమే సరైనదని, శత్రువు దాని దరిదాపులకు కూడా చేరలేరని తేల్చి ఖరారు చేశారు. ఈ ప్లీనరీ తేదీలు, స్థలం వంటి విషయాలు కిందిస్థాయి నేతలకు చేరనివ్వరు. డివిజన్‌ కార్యదర్శి, జిల్లా కమిటీ కార్యదర్శి, జోనల్‌ కమిటీ కార్యదర్శి, ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యులకు మాత్రమే సమాచారం అందిస్తారు. దీంతో పోలీసులతో కాంటాక్ట్ పెట్టుకున్న ఆ డివిజన్‌ కమిటీ నేతకు కూడా ఈ సమాచారం అందింది. ఇది తెలుసుకున్న పోలీసులు అతనికి అత్యాధునిక పరికరాలు అందించారు. వాటిని ట్రాక్ చేయడం ప్రారంభించారు. అక్టోబరు 15 నుంచే అతని ప్రతి కదలికను పోలీసులు గమనించడం ప్రారంభించారు. మూడో కంటికి తెలియకుండా అతని కదలికలు కనిపించిన ప్రాంతానికి రేడియస్ గా 15 కిలోమీటర్ల పరిధిలోని సెల్‌ టవర్లపై నిఘా ఏర్పాటు చేశారు. దీనికితోడు ప్రత్యేక యుటిలిటీ వాహనంతో జీపీఎస్‌ ను ట్రాక్ చేశారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం మల్కన్ గిరి అటవీ ప్రాంతంలో రామగూడకు చేరుకున్నారు. నిజానికి ప్లీనరీకి ఆర్కే హాజరవుతున్న సమాచారం ఎవరి వద్దా లేదు. అయితే, 22న ఆయన రావడం, 23న ఆపరేషన్ చేపట్టడం మావోలను హతమార్చడం మొత్తం తెలిసిందే. అయితే ఆర్కే ఆచూకీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన క్షేమమేనా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా? అన్న ప్రశ్న అందర్లోనూ ఆసక్తి రేపుతోంది.

More Telugu News