: మారుతున్న పంజాబ్ రాజకీయం.. సిద్ధూతో 'ఆప్' చర్చలు?

టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆవాజ్‌-ఇ-పంజాబ్‌ అధినేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూతో ఆమ్‌ ఆద్మీ పార్టీ చర్చలు జరుపుతోంది. పంజాబ్ లో జోరుగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ తో బీజేపీ కీర్తి అమాంతం పెరిగిపోగా, అకాలీదళ్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలతో సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధూను లాక్కునేందుకు కాంగ్రెస్, ఆప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. పంజాబ్ లో సిద్ధూకు ఉన్న ఫేమ్ తమకు బలమవుతుందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో ఆప్ మంతనాలు జరుపుతోంది. సిద్ధూతో చర్చలు జరుపుతున్న విషయాన్ని ఆప్‌ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ నిర్ధారించారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ గెలుపొందేందుకు సిద్ధూ సహకారం కోసం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తమ బంధం చర్చల దశలో ఉందని, నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆప్‌ కన్వీనర్‌, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తో సిద్ధూ సమావేశమైనట్లు తెలుస్తోంది. పంజాబ్ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు, ఆవాజ్‌-ఇ-పంజాబ్‌ పార్టీకి 7 నుంచి 8 సీట్లు కేటాయించాలని సిద్ధూ ఆప్‌ ను డిమాండ్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. కాగా, బీజేపీ నుంచి వేరుపడ్డ సిద్ధూ తమ పార్టీలోకి వస్తే కీలకపదవితో ఆయనను సత్కరిస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధూను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలంటే ఆయన తమపార్టీలో ఉండడం ముఖ్యమని కాంగ్రెస్, ఆప్ భావిస్తున్నాయి.

More Telugu News