: హవ్వ.. ప్రపంచకప్ గెలిస్తే ప్రోత్సాహకం 10 లక్షల రూపాయలా?: విస్మయం వ్యక్తం చేసిన కబడ్డీ ఆటగాడు

ప్రపంచ కప్ గెలిచిన భారత కబడ్డీ జట్టుకు క్రీడాశాఖ ప్రకటించిన నజరానా చూసి కబడ్డీ ఆటగాళ్ల నోటమాటపడిపోయింది. ఒలింపిక్స్ లో రజత, కాంస్యపతకాలు సాధించిన క్రీడాకారిణులకు ఊహించని రీతిలో నజరానాలు అందాయి. అలాగే క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ గతంలో భారీ నజరానా ప్రకటించింది. దీంతో క్రీడల దశ తిరిగిందని, మేజర్ ఈవెంట్లలో విజయం సాధిస్తే ఆటగాళ్ల జీవితాలు రాత్రికి రాత్రేమారిపోతాయని భావిస్తున్న దశలో కబడ్డీ ఆటగాళ్లకు క్రీడాశాఖ ప్రకటించిన 10 లక్షల రూపాయల నజరానా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనిపై జట్టు ఆటగాడు అజయ్ ఠాకూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. క్రీడా శాఖ ప్రకటన తమను ఆశ్చర్యానికి, నిరాశకు గురి చేసిందని తెలిపాడు. 10 లక్షల నజరానాను పంచుకుంటే, 14 మంది ఆటగాళ్లతోపాటు, జట్టు మేనేజ్ మెంట్, సహాయక సభ్యులు.. ఇలా ఎవరెవరికి ఎంతెంత వస్తుందని అన్నాడు. తామేమీ కోట్లు కురిపించండి అని అడగడం లేదని, అయితే క్రీడలన్నింటినీ సమానంగా చూడాలని కోరుకుంటున్నామని అజయ్ ఠాకూర్ ప్రభుత్వానికి సూచించాడు. వాస్తవానికి భారత్ కు ప్రాతినిధ్యం వహించి వరల్డ్ కప్ లో ఆడుతానని భావించకపోయినా, ఏకంగా వరల్డ్ కప్ గెలుచుకోవడం గర్వంగా ఉందని అన్నాడు.

More Telugu News