: దలైలామా భారత్ లో ఏ ప్రాంతాన్నైనా సందర్శించవచ్చు: కేంద్రం

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ సందర్శనకు మార్గం సుగమమైంది. దలైలామా తమ రాష్ట్రాన్ని సందర్శించాలని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ అక్టోబర్ 9న ఆహ్వానించారు. అయితే శరణార్థిగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్న దలైలామా భారత్ లో ని ఇతర ప్రాంతాల సందర్శనకు నిబంధనలు అంగీకరించకపోవడంతో ఆయన ఫెమా ఖండూ ఆహ్వానాన్ని మన్నించలేదు. ఈ నేపథ్యంలో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, భారత్ లోని ఏ ప్రాంతాన్నైనా ఆయన సందర్శించవచ్చని కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఏడాది మార్చిలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ను సందర్శించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ‘దలైలామా భారతదేశంలో ఏ ప్రాంతాన్నైనా సందర్శించవచ్చు. దీని వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని స్పష్టం చేసింది. కాగా, అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడాన్ని చైనా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగమని, తమ దేశంలో ఎవరు పర్యంటించాలో, ఎవరు పర్యటించకూడదో చెప్పే ప్రయత్నం చేయవద్దని చైనాకు భారత్ ఘాటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News