: ఉప్పును అధికంగా తీసుకుంటున్న భారతీయులు.. ముప్పేనని హెచ్చరిస్తోన్న పరిశోధకులు

శరీరానికి ఉప్పు ఎంతో మేలు చేస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. అతి ఏదైనా ముప్పే అన్న‌ట్లు ఉప్పును కూడా అతిగా తీసుకుంటే తిప్ప‌లు త‌ప్ప‌వని ప‌రిశోధ‌కులు అంటున్నారు. ప్ర‌ధానంగా భారతీయులు ఈ అంశంలో అశ్ర‌ద్ధ వ‌హిస్తున్నార‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా పేర్కొంది. భార‌తీయులు అవ‌స‌ర‌మైన‌దాని కంటే రెండు రెట్లు ఎక్కువ‌గా ఉప్పు తీసుకుంటున్నారని తేలింది. ఉప్పు అధికంగా తీసుకుంటే హృద్రోగ‌ ముప్పు పెరుగుతుంద‌ని డ‌బ్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. ఒక మ‌నిషి రోజుకి ఐదుగ్రాముల ఉప్పు తీసుకోవాల‌ని డ‌బ్యూహెచ్‌వో గ‌తంలో సూచించింది. అయితే టీనేజ్ దాటిన ఇండియ‌న్లు ప్రతిరోజూ 10.98 గ్రాముల మేర ఉప్పును తీసుకుంటున్నార‌ని జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్ పరిశోధ‌న చేసి తేల్చిచెప్పింది. తూర్పు, దక్షిణ భారత్ వాసులు ఉప్పును అత్య‌ధికంగా వాడుతున్నార‌ని పేర్కొంది. రోజుకు 14 గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్న వ్య‌క్తుల‌ను క‌లిగి ఈ అంశంలో త్రిపుర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంద‌ని చెప్పింది. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన క్లైర్‌ జాన్సన్ మాట్లాడుతూ.. 30 ఏళ్లలో ఇండియ‌న్ల‌ సగటు ఆహార అలవాట్లలో పప్పులు, కూరగాయలు, పండ్లు వంటి ప‌దార్థాలు తగ్గిపోయాయ‌ని పేర్కొన్నారు. భార‌తీయుల ఆహార అల‌వాట్ల‌లో మార్పులు వ‌చ్చి ఇప్పుడు ప్రాసెస్‌ చేసిన ఫాస్ట్‌ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ఆహార అలవాట్ల వ‌ల్ల అధిక శాతం ఉప్పు, చక్కెర, హానిచేసే కొవ్వు పదార్థాలు వారి శ‌రీరంలోకి వెళుతున్నాయ‌ని పేర్కొన్నారు. అందుకే భార‌తీయులు రక్తపోటు, స్థూలకాయం, హృద్రోగాల బారిన అధికంగా పడుతున్నారని చెప్పారు. ఉప్పు ఎక్కువ‌గా తీసుకుంటే అధిక‌ రక్తపోటు వ‌చ్చి హృద్రోగాలు సంభ‌విస్తున్నాయ‌ని, ఉప్పును మోతాదులో తీసుకోవాల‌ని ప‌రిశోధ‌కులు సూచించారు. ఇండియాలో అత్యధిక మరణాలకు కార‌ణంగా గుండెజబ్బులే నిలుస్తున్నాయని ప‌రిశోధ‌కులు తెలిపారు. ప్ర‌తీ ఏడాది ఈ కార‌ణంగానే 23 లక్షలమంది మృతి చెందుతున్నార‌ని చెప్పారు. 2030 నాటికి అధిక రక్తపోటు బారిన పడే వారి సంఖ్య రెట్టింపు అవుతుంద‌ని పేర్కొన్నారు. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు మానుకోవాల‌ని సూచించారు. ఉప్పు తీసుకునే అంశంలో డ‌బ్యూహెచ్‌వో సూచ‌న‌లు పాటించాల‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. 2025 నాటికి భార‌త్‌లో అధికంగా ఉప్పు తీసుకునే అల‌వాటును 30 శాతం మేర తగ్గించాల‌ని డ‌బ్యూహెచ్‌వో స‌ల‌హా ఇస్తోంద‌ని సూచించారు.

More Telugu News