: లాంగాఫ్‌లో ఉన్న మన సంబంధాలు పిచ్ మధ్యలో ప్రెష్‌గా గార్డు తీసుకున్నాయి.. న్యూజిలాండ్ ప్రధానితో మోదీ క్రికెట్ భాష!

సందర్భానికి అనుగుణంగా మాటలు కలపడంలో దిట్ట అయిన ప్రధాని మోదీ మరోమారు తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీతో క్రికెట్ పరిభాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ నుడస్తున్న నేపథ్యంలో భారత్-న్యూజిలాండ్ మధ్య ఉన్న సంబంధాలను క్రికెట్ పరిభాషలో పేర్కొని జాన్ కీని అవాక్కయ్యేలా చేశారు. జాన్‌కీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. ‘‘మరికొద్ది సేపట్లో రాంచీలో భారత్-కివీస్ జట్లు తలపడనున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని వర్ణించేందుకు క్రికెట్‌లో కొన్ని పదాలు అతికినట్టు సరిపోతాయి. గతంలో లాంగాఫ్‌ ఫీల్డింగ్‌లా దూరంగా వున్న మన సంబంధాలు ఇప్పుడు సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ పిచ్ మధ్యలో ఫ్రెష్‌గా గార్డ్ తీసుకున్నాయి’’ అని పేర్కొనడంతో కీ నవ్వులు చిందించారు. దూకుడైన బ్యాటింగుకు రక్షణాత్మక విధానం దారివ్వక తప్పదని మోదీ పేర్కొన్నారు. అయితే న్యూజిలాండ్ జట్టు పేలవ ప్రదర్శనపై మోదీ వ్యాఖ్యానించకపోవడంతో జాన్ కీ ‘హమ్మయ్య’ అని సరదాగా వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న క్రీడా సహకార ఒప్పందం సవరణలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.

More Telugu News