: మూడు కంటెయినర్ల నిండా డబ్బే డబ్బు.. ఆసక్తిగా మారిన సొమ్ము తరలింపు

ఆరు నెలల క్రితం సేలం నుంచి రైలులో చెన్నైలోని రిజర్వు బ్యాంకుకు పంపుతున్న సొమ్ములో రూ.5.75 లక్షలను రైలుకు కన్నం వేసి మరీ దుండుగులు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీసీఐడీ ఇప్పటికీ నిందితులను కనిపెట్టలేకపోయింది. దీంతో ఈసారి బ్యాంకు అధికారులు రూటు మార్చారు. ఈరోడ్ జిల్లాలోని వివిధ బ్యాంకుల నుంచి సేకరించిన కరెన్సీని మూడు కంటెయినర్లలో రోడ్డు మార్గాన రిజర్వు బ్యాంకుకు తరలించారు. పెద్దమొత్తంలో కరెన్సీతో నిండిన కంటెయినర్లు మంగళవారం ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గాన కోయంబత్తూరు నుంచి బయలుదేరాయి. ఈ లారీలకు కోయంబత్తూరు సహాయ కమిషనర్ మురుగస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు తరలివెళ్లింది. ఆరు కార్లతో లారీలను ముందు వెనుక అనుసరించారు. మధ్యాహ్నం విల్లుపురం జిల్లాలోని ఊలుందుర్‌పేటకు చేరుకున్న లారీలను రోడ్డు పక్కన ఆపి డ్రైవర్లు, పోలీసులు భోజనం చేశారు. ఆ సమయంలో బయట నిలిపిన కంటెయినర్లకు 50 మంది పోలీసులు రక్షణగా నిలిచారు. దీంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. కంటెయినర్లలో ఏముందోనని చర్చించుకోవడం కనిపించింది. జనాలు గుమిగూడడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించివేశారు.

More Telugu News