: టార్గెట్ 2018... పనులను పరుగులు పెట్టించండి: చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణ పనులను నవంబర్ 1వ తేదీ నుంచి పరుగులు పెట్టించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 'టార్గెట్ 2018' నినాదంతో పరిపాలన నగరం, ఇతర మౌలిక సదుపాయాల పనులను ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఈ రోజు ఆయన సీఆర్డీఏ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 28న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేసిన తర్వాత, ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ఇవతలి కొండపై కనకదుర్గమ్మ కొలువై ఉన్నందున... అవతలి కొండపై బుద్ధుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని చెప్పారు. అమరావతిలో మతసామరస్యం వెల్లివిరియాలని... టీటీడీ వెంకటేశ్వర ఆలయం, ఇస్కాన్ కృష్ణుడి మందిరాలతో పాటు చర్చి, మసీదుల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని చెప్పారు. అమరావతిలో నిర్మించే భవనాలు, కట్టడాలలో ఏకరూపత ఉండాలని, వాటి నిర్మాణశైలిలో ఆంధ్రప్రదేశ్ కళలు, బౌద్ద సంస్కృతులు ప్రతిబింబించాలని తెలిపారు.

More Telugu News