: ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తే ఆ దేశం ఏ దేశంపైనైనా అణుబాంబులు ప్ర‌యోగిస్తుంది: డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌త్య‌ర్థిగా ఉన్న‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హిల్లరీ అనుస‌రించాల‌నుకుంటున్న‌ విదేశాంగ విధానంపై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. హిల్ల‌రీ ఎన్నిక‌ల్లో గెలిస్తే సిరియాలో ఆమె చేప‌ట్ట‌బోయే ప్ర‌ణాళిక మూడో ప్ర‌పంచ యుద్ధానికి దారి తీస్తుంద‌ని ట్రంప్ అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు లేకుండా చేసే ప‌నిని అమెరికా చేయాల‌ని ఆయ‌న అన్నారు. అంతేగాని, సిరియా అధ్య‌క్షుడిని తొల‌గిస్తే లాభ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. హిల్ల‌రీ క్లింట‌న్‌ సిరియాను 'నో ఫ్లై జోన్‌'గా చేయాల‌ని భావిస్తున్నారని అన్నారు. అయితే, అదే క‌నుక చేస్తే అమెరికాకు ర‌ష్యాతో మ‌రింత‌ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌ని యూఎస్ మిలిట‌రీ చీఫ్ హెచ్చ‌రిస్తున్నారని తెలిపారు. ప్ర‌త్య‌ర్థిపైనే కాకుండా తన‌ సొంత పార్టీ అయిన‌ రిప‌బ్లిక‌న్స్‌పై కూడా ట్రంప్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ ఐకమ‌త్యంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. అలా ఉంటే త‌న ప్ర‌త్య‌ర్థి చేతిలో ఓట‌మి చ‌విచూసే అవ‌కాశం ఉండ‌బోద‌ని చెప్పారు. ర‌ష్యా ఒక అణు దేశ‌మ‌ని డొనాల్డ్‌ ట్రంప్ అన్నారు. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తే ఆ దేశం ఏ దేశంపైనైనా అణుబాంబులు ప్ర‌యోగిస్తుంద‌ని పేర్కొన్నారు. హిల్ల‌రీ క్లింట‌న్‌ పుతిన్‌పై విమ‌ర్శలు చేస్తోంద‌ని, ఆమె అమెరికాకు అధ్య‌క్షురాల‌యితే ఆయ‌న‌తో చ‌ర్చ‌లు ఎలా జ‌రుపుతుంద‌ని ఆయ‌న అడిగారు.

More Telugu News