: రైతులు డబ్బులిచ్చి కరెంటు కనెక్షన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి.. రూపాయి లంచం తీసుకున్నా సహించేది లేదు: కేసీఆర్ హెచ్చరిక

రాష్ట్రంలో 97వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, వారందిరికీ ఏడు నెలల్లో పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విద్యుత్ అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ విద్యుత్‌పై టీజెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, రైతులు కరెంటు ఆఫీసుల చుట్టూ తిరగకుండానే వారికి కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డబ్బులిచ్చి రైతులు కరెంటు కనెక్షన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అది పోవాలని అన్నారు. పెండింగులో ఉన్న 97వేల దరఖాస్తులతోపాటు మున్ముందు వచ్చే 20-30వేల దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మొత్తం అందరికీ కనెక్షన్లు ఇవ్వాలంటే రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అధికారుల అంచనాపై సీఎం స్పందిస్తూ అదంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైతులు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తుండడంతో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఓ ప్రణాళిక తయారుచేసుకోవాలని, ఎప్పుడు ఏ మండలాలకు ఇస్తారో షెడ్యూల్ తయారుచేసుకుని ఆయా మండలాల రైతులకు సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌కు ఎటువంటి ఇబ్బందులు లేవని, వేసవిలో కరెంటు కోతలు లేకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని సూచించారు. రబీ సీజన్‌లో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News