: రాజ్‌నాథ్, వెంకయ్యలకు చంద్రబాబు ఫోన్.. ప్యాకేజీ చట్టబద్ధతపై 28న బహిరంగ సభలో ప్రకటించాలని కోరిక

ప్రత్యేక హోదాకు సమానంగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడులను కోరారు. ఈ నెల 28న రాజధాని అమరావతిలో తొలిదశలో శాశ్వత సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, అసెంబ్లీ, శాసన మండలి భవనాలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, నేతలతో చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడుకు చంద్రబాబు ఫోన్ చేశారు. శంకుస్థాపన విషయం చెప్పి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ప్యాకేజీకి చట్టబద్ధత విషయాన్ని సభలోనే ప్రజలకు తెలియజేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల కోసం నిధుల విడుదలపైనా ప్రకటన చేస్తే బాగుంటుందన్నారు. కేంద్ర మంత్రులు ఉమాభారతి, అరుణ్ జైట్లీతోనూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News